ప్రాథమిక నివేదికపై కేంద్రమంత్రి రామ్మోహన్‌ కీలక వ్యాఖ్యలు!

అహ్మదాబాద్‌ జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే;

Update: 2025-07-12 09:46 GMT

అహ్మదాబాద్‌ జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. విమానం టేకాఫ్‌ అయ్యాక సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్‌ స్విచ్‌ లు ఆగిపోయినట్లు వెల్లడించింది. దీంతో... ఆ ప్రమాదానికి గల కారణంపై జనం ఓ క్లారిటీకి వస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ స్పందించారు.

అవును... జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా... విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని, తుది నివేదిక వచ్చేవరకు వేచి చూడాలని సూచించారు. తాజాగా విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా... ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది మన దగ్గర ఉన్నారని చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్... వారు పౌర విమానయానానికి వెన్నెముక వంటివారని.. ఈ రంగానికి వారే ప్రధాన వనరులని అన్నారు. అలాంటి వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని.. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ధారణకు రాకుండా తుది నివేదిక కోసం వేచిచూద్దామని అన్నారు.

ఇదే సమయంలో... ఈ కేసులో ఎన్నో టెక్నికల్‌ అంశాలు ఇమిడి ఉన్నాయని చెప్పిన మంత్రి.. అందుకే ఈ నివేదికపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అన్నారు. ఇటీవలి కాలంలో అత్యంత ప్రాణాంతకమైన ప్రమాదాలలో ఒకటైన అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదానికి గల కారణామలై ఏఏఐబీ ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత రామ్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా.. ఏఏఐబీ విడుదల చేసిన 15 పేజీల ప్రాథమిక నివేదికలో.. విమానం టేకాఫ్‌ అయిన సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్‌ స్విచ్‌ లు ఆగిపోయినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. 'ఆ స్విచ్‌ ఎందుకు ఆఫ్‌ చేశావు' అని ఒక పైలట్‌ మరో పైలట్‌ ను ప్రశ్నించాడని.. దీనికి సమాధానంగా... 'తాను స్విచ్‌ ఆఫ్‌ చేయలేదు' అని మరో పైలట్‌ సమాధానం ఇచ్చినట్లు రిపోర్ట్‌ లో పేర్కొంది.

కాక్‌ పిట్‌ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ తెలిపింది. తర్వాత పైలట్లు ‘మేడే కాల్‌’ ఇచ్చారని వెల్లడించింది. ఈ రెండు స్విచ్‌ లు ఒక సెకను తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు తెలిపింది. ఇదే సమయంలో... ప్రమాదానికి ముందు విమానం కేవలం 32 సెకన్ల పాటు గాల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంలో మొత్తం 260 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News