నిన్న 'మే డే' కాల్, నేడు 'డొంట్ సింక్' అలర్ట్... ఇది ఎందుకో తెలుసా?
ఇక... టేకాఫ్ తర్వాత పైలట్ లు సానుకూల ఆరోహణ రేటును నిర్వహించడానికి మోడ్ - 3 సహాయ పడుతుంది.;
జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారు 241 మంది, బయట పౌరులు 19 మంది మరణించారు. ఆ విమానం ప్రమాదానికి గురయ్యే సెకన్ల ముందు పైలెట్ల నుంచి ఏటీసీకి "మే డే" కాల్ వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో... ఏమిటీ మే డే కాల్ అనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇది విమానంలో సమస్య ఎదురైనప్పుడు పైలెట్ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వచ్చే కాల్. అయితే... ఆ ప్రమాదం జరిగిన 38 గంటల్లోనే మరో ఎయిరిండియా విమానం టెన్షన్ పెట్టింది. ఇందులో భాగంగా... జూన్ 14 తెల్లవారుజామున ఢిల్లీ నుండి బయలుదేరి వియన్నాకు వెళ్తున్న బోయింగ్ 777 విమానం స్టాల్ హెచ్చరికను అందుకుంది.
అవును... జూన్ 14 తెల్లవారుజామున ఢిల్లీ నుండి బయలుదేరి వియన్నా విమానం ఒక్కసారిగా 900 అడుగుల మేర కిందికి దిగిపోయింది. దీంతో... విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఆ సమయంలో... గ్రౌండ్ ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్స్ (జీ.పీ.డబ్ల్యూ.ఎస్) నుంచి వార్నింగ్ సిగ్నల్ వెలువడింది.. అదే... "డోంట్ సింక్"! ఆ అలర్ట్ ఏమిటనేది ఇప్పుడు చూద్దామ్..!
విమానం ల్యాండింగ్ సమయంలో లేదా భూమికి దగ్గరగా ఉన్నప్పుడల్లా మోడ్ - 1 హెచ్చరిస్తుంది. ఈ క్రమంలో వెలువడే ప్రారంభ హెచ్చరిక "సింక్ రేట్" (విమానం ఎత్తును కోల్పోయే రేటు) కాగా... విమానం పర్వతం పైకి లేదా నిటారుగా ఉన్న ప్రదేశాల మీదుగా ఎగురుతుంటే, అప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ వేగంగా తగ్గుతుంటే.. మోడ్ - 2 "ఫుల్ అప్" అని హెచ్చరిక జారీ అవుతుంది.
ఇక... టేకాఫ్ తర్వాత పైలట్ లు సానుకూల ఆరోహణ రేటును నిర్వహించడానికి మోడ్ - 3 సహాయ పడుతుంది. ఇందులో భాగంగా... విమానం 1,000 అడుగులకు చేరుకున్న తర్వాత.. ఒక్కసారిగా ఎత్తు దిగడం ప్రారంభిస్తే సిస్టమ్ "డోంట్ సింక్" అనే హెచ్చరికను వినిపిస్తుంది. అదేవిధంగా... ల్యాండింగ్ గేర్ లేదా ఫ్లాప్ లు ల్యాండింగ్ కోసం సరిగ్గా కాన్ఫిగర్ చేయకపోతే మోడ్ - 4 హెచ్చరిస్తుంది.
అంటే... విమానం చాలా వేగంగా కిందకు దిగుతున్నప్పుడు, ముఖ్యంగా భూమిని సమీపిస్తున్నప్పుడు లేదా భూమికి దగ్గరగా ఉన్నప్పుడు గ్రౌండ్ ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్ (జీ.పీ.డబ్ల్యూ.ఎస్) ద్వారా "డోంట్ సింక్" (మునిగిపోవద్దు) హెచ్చరికలు జారీ చేయబడతాయి. ఈ హెచ్చరికలు పైలట్ లకు ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడానికి సహాయపడతాయి.
కాగా... అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యునికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీ కి తెలియజేయడానికి చేసేదాన్ని మేడే కాల్ అంటారనే సంగతి తెలిసిందే. అంటే... తాము ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం కావాలని విజ్ఞప్తి చేయడం అన్నమాట. ఎమర్జెన్సీ సమయాల్లో పైలెట్లు ‘మేడే’ అనే పదాన్ని మూడు సార్లు చెబుతారు!