జనరేటివ్ AI : వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు!
ఇదే వేగంతో ముందుకు వెళ్తే, ఇది వైద్య శాస్త్రజ్ఞులకు "రెండవ స్వర్ణయుగం"ను తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.;
వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. మందులకు లొంగని సూపర్‌బగ్స్‌తో పోరాడేందుకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) శాస్త్రవేత్తలు జనరేటివ్ AI సాయంతో రెండు సరికొత్త యాంటీబయాటిక్స్‌ను విజయవంతంగా అభివృద్ధి చేశారు.
-కొత్త యాంటీబయాటిక్స్ అవసరం ఎందుకు?
ప్రస్తుతం మనం వాడుతున్న యాంటీబయాటిక్స్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా వాటికి వ్యతిరేకంగా శక్తివంతమైన నిరోధకతను పెంచుకుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు నయం కావడం లేదు. ఇలాంటి బ్యాక్టీరియాలనే మనం సూపర్‌బగ్స్ అని పిలుస్తాము. దాదాపు కొన్ని దశాబ్దాలుగా కొత్త యాంటీబయాటిక్స్‌ను కనుగొనడంలో గణనీయమైన పురోగతి లేదు. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారుగా ఒక మిలియన్‌కు పైగా మరణాలకు యాంటీబయాటిక్స్ నిరోధకత కలిగిన ఇన్ఫెక్షన్లు కారణమవుతున్నాయి.అందుకే ఈ కొత్త ఆవిష్కరణ వైద్య ప్రపంచానికి ఒక ఆశాకిరణంలా మారింది.
- AI ఎలా పనిచేసింది?
MIT శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణ కోసం జనరేటివ్ AI అల్గారిథమ్స్ ను ఉపయోగించారు. ఈ అల్గారిథమ్స్ వేలాది రసాయనిక అణువులను చాలా వేగంగా విశ్లేషించగలవు. మానవ కన్ను చూడలేని, లేదా విశ్లేషించలేని లక్షణాలను కూడా ఇది సులభంగా గుర్తిస్తుంది. ఈ ప్రక్రియలో AI ఈ కింది లక్షణాలను గుర్తించింది. ఏ అణువులు శక్తివంతమైన యాంటీబయాటిక్‌గా పనిచేయగలవు. ఆ అణువులు మానవ శరీరానికి హానికరం కావు. ఈ విధానంలో ఎంపికైన రెండు అద్భుతమైన అణువులు గోనోరియా , MRSA (మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టాఫిలోకాకస్ ఆరియస్) వంటి ప్రాణాంతక బ్యాక్టీరియాలను సమర్థవంతంగా నాశనం చేయగలవని పరిశోధనల్లో తేలింది.
ఈ ఆవిష్కరణపై MIT ప్రొఫెసర్ జేమ్స్ కొల్లిన్స్ మాట్లాడుతూ "మా పరిశోధన జనరేటివ్ AI ద్వారా పూర్తిగా కొత్త యాంటీబయాటిక్స్‌ను సృష్టించవచ్చని రుజువు చేసింది. ఇది చాలా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ సమయంలో కొత్త మందులను కనిపెట్టడానికి మార్గం సుగమం చేస్తుంది" అని అన్నారు.
- భవిష్యత్తుపై ఆశలు...
ఈ AI ఆధారిత ఆవిష్కరణతో, కొత్త మందుల కనుగొనే ప్రక్రియ వేగవంతం కానుంది. ఇదే వేగంతో ముందుకు వెళ్తే, ఇది వైద్య శాస్త్రజ్ఞులకు "రెండవ స్వర్ణయుగం"ను తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనరేటివ్ AI కేవలం యాంటీబయాటిక్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. గతంలో కూడా అమెరికా, యూకే, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల బృందం ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్స కోసం ఒక AI ఆధారిత పరీక్షను అభివృద్ధి చేసింది. ఈ పరీక్ష ద్వారా ఏ మందు రోగికి బాగా పనిచేస్తుందో కచ్చితంగా గుర్తించి, వ్యక్తిగతీకరించిన చికిత్సను అందించగలిగారు. ఇది కూడా AI శక్తికి ఒక చక్కని ఉదాహరణ.
ఈ పరిశోధనలన్నీ యాంటీబయాటిక్స్‌కు నిరోధకత ఉన్న సమస్యకు పరిష్కారాన్ని చూపించడమే కాకుండా, భవిష్యత్తులో అనేక వ్యాధులకు కొత్త చికిత్సలు, మందులు కనుగొనడంలో AI కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నాయి.