దారుణం... విమాన ప్రమాద బాధితుల కుటుంబాలకు మరో సమస్య!
స్వదేశానికి తరలించిన అవశేషాలపై నిర్వహించిన డీ.ఎన్.ఏ పరీక్షలో కనీసం రెండు శవపేటికలలో వ్యత్యాసాలు వెల్లడయ్యాయని, బాధితుల కుటుంబాల డీ.ఎన్.ఏతో అవి సరిపోలడం లేదని ఆయన ఆరోపించారు.;
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో 260 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో విమానంలోని ఉన్నవారు 241 మంది కాగా వారిలో సుమారు ఏభై మూడు మంది యూకేకి చెందినవారు ఉన్నారు! ఈ సమయంలో అక్కడున్న బాధిత కుటుంబాలకు మరో సమస్య ఎదురైంది. ఇందులో భాగంగా... యుకేలో కనీసం రెండు కుటుంబాలకు చేరాల్సిన మృతదేహాలు మారిపోయినట్లు తేలింది.
అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలోని తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మరో దారుణ సమస్య ఎదురింది. ఇందులో భాగంగా... మృతదేహాలు మారిపోయినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా మృతుల అవశేషాలను తప్పుగా గుర్తించి, వాటినే యూకెకు పంపించారని బాధితుల పక్షాన కేసు చూస్తున్న కీస్టోన్ లా సంస్థకు చెందిన న్యాయవాది తెలిపారు.
స్వదేశానికి తరలించిన అవశేషాలపై నిర్వహించిన డీ.ఎన్.ఏ పరీక్షలో కనీసం రెండు శవపేటికలలో వ్యత్యాసాలు వెల్లడయ్యాయని, బాధితుల కుటుంబాల డీ.ఎన్.ఏతో అవి సరిపోలడం లేదని ఆయన ఆరోపించారు. దీంతో వారి కుటుంబాలు అంత్యక్రియలను వాయిదా వేసుకొన్నాయని.. ఆ శవపేటికలోని మృతదేహం గుర్తు తెలియని వ్యక్తిదని ఆ కుటుంబ సభ్యులు తెలిపారని అన్నారు.
మరో కుటుంబం విషయంలో... వారి కుటుంబ సభ్యుడి అవశేషాలను మరొక ప్రయాణీకుడి అవశేషాలతో కలిపి ఇచ్చారని.. ఇద్దరు బాధితుల అవశేషాలను ఒకే శవపేటికలో ఉంచారని న్యాయవాది తెలిపారు. కుటుంబ సభ్యుని అంత్యక్రియలు నిర్వహించే ముందు ఆ ఇద్దరు ప్రయాణీకుల అవశేషాలను కుటుంబం వేరు చేయాల్సి వచ్చిందని అన్నారు.
ఈ సందర్భంగా... కొంతమంది మృతదేహాలను వారి వారి మత విశ్వాసాల ప్రకారం భారతదేశంలో దహనం చేయడం లేదా ఖననం చేయడం జరిగిందని.. వీరిలో 12 మంది అవశేషాలను స్వదేశానికి తరలించారని ఈ విషయంలో అనేక బ్రిటిష్ కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విమానయాన న్యాయవాది జేమ్స్ హీలీ ప్రాట్ 'ది డైలీ మెయిల్'తో అన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన భార్త విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్... అన్ని మృతదేహాలను అత్యంత వృత్తి నైపుణ్యంతో, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల డీ.ఎన్.ఏ తో సరిపోల్చి, తగిన గౌరవంతో నిర్వహించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరించడానికి తాము యూకే అధికారులతో కలిసి పని చేస్తామని తెలిపారు!
కాగా... జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా ఏఐ171 విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో.. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది చనిపోయారు. వీరిలో 53మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. అయితే.. వీరిలో చాలా మంది అంత్యక్రియలు భారత్ లోనే ముగించగా.. కేవలం 12 మంది మృతదేహాలను బ్రిటన్ కు తరలించారు.