టేకాఫ్ అయిన సెకన్లలోనే మృత్యు ఒడికి... షాకింగ్ సీసీటీవీ వీడియో!

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. విమానం రన్ వే పై బయలుదేరిన 20 సెకన్లలోపు గాల్లోకి లేచింది.;

Update: 2025-06-12 15:40 GMT

గురువారం మధ్యాహ్నం 242 మందితో అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్ లైనర్.. టెకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇది భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన విమానయాన విషాదాలలో ఒకటని చెబుతున్నారు. ఈ సమయంలో ఓ షాకింగ్ వీడియో తెరపైకి వచ్చింది.

అవును... గురువారం మధ్యాహ్నం 1:39 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం.. బయలుదేరిన నిమిషంలోపే కుప్పకూలినట్లు చూపించే ఓ సీసీటీవీ దృశ్యం వెలుగులోకి వచ్చాయి. బయలుదేరిన కొన్ని సెకన్లలోనే ఆ విమానం బ్లాస్ట్ అయిపోయింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. విమానం రన్ వే పై బయలుదేరిన 20 సెకన్లలోపు గాల్లోకి లేచింది. అనంతరం గాల్లో 30 సెకన్లు మాత్రం ప్రయాణించినట్లు కనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా కూలిపోయింది.. భారీ శబ్ధంతో, పెద్ద మంటతో పేలిపోయింది. అనంతరం చుట్టూ పెద్ద ఎత్తున నల్లటి పొగ ఆవహించి, భయానక వాతావరణాన్ని సృష్టించింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉండగా... ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 గురు పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నట్లు ఎయిర్ ఇండియా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.

ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్.. విజయ్ రూపానీ మృతి చెందిన విషయాన్ని ధృవీకరించారు. లండన్ లో ఉంటున్న తన కుమార్తెను చూడటానికి విజయ్ రూపానీ బయలుదేరినట్లు తెలుస్తోంది.

మరోపక్క ఈ ఘోర విమాన ప్రమాదంలో ఎవరూ బ్రతికి లేరని, ఇది షాకింగ్ విషయమని ప్రకటనలు వెలువడినట్లు ప్రచారం జరిగిన కాసేపట్లోనే.. ఓ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడినట్లు అహ్మదాబాద్ పోలీసులు నిర్థారించినట్లు కథనాలొచ్చ్చాయి. ఈ సందర్భంగా 11ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడనే వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News