సోదరుడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు... ఎమోషనల్ వీడియో!

అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం అత్యంత ఘోరమైనది.;

Update: 2025-06-18 11:13 GMT
సోదరుడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు... ఎమోషనల్  వీడియో!

ఈ నెల 12న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికుల్లోనూ ఒకే ఒక్కరు విశ్వాస్ కుమార్ గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే. అతడిని మృత్యుంజయుడు అని పిలుస్తోంది నెట్ ప్రపంచం. ఆ రోజు స్వల్ప గాయాలతో అగ్నిగోళం పక్కనుంచి నడుచుకుంటూ వచ్చి ఆస్పత్రిలో చేరిన విశ్వాస్.. తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం అత్యంత ఘోరమైనది. భారతదేశ చరిత్రలో జరిగిన భారీ విమాన ప్రమాదాల్లో అది ఒకటి. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయి.. అగ్నిగోళాన్ని తలపిస్తూ మండిపోయిన విమానంలోంచి విశ్వాస్ కుమార్ సంజీవంగా బయటపడటం.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి!

ఈ క్రమంలో ఆ రోజు నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ కుమార్.. మంగళవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డీ.ఎన్.ఏ పరీక్షలు పూర్తయిన తర్వాత అతడి సోదరుడు అజయ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అధికారులు అందించారు. మరోవైపు యూకే నుంచి వారి బంధువులు ఇప్పటికే ఇక్కడకు చేరుకున్నారు.

దీంతో.. బుధవారం ఉదయం డయ్యూలో అజయ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సమయంలో సోదరుడి పార్థీవదేహాన్ని చూసిన విశ్వాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం సోదరుడి పాడె మోసాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట దర్శనమిచ్చింది.. పరువురిని కంటతడి పెట్టిస్తోంది. అజయ్, విశ్వాస్ లు తమ కుటుంబ సభ్యులతో గడిపిన అనంతరం లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News