ఆ 27 రైల్వే స్టేషన్లలో రూ.20కే ఫుడ్.. మిస్ కావొద్దు
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు.. ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని పథకాల్ని అమలు చేస్తుంటాయి.;
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు.. ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని పథకాల్ని అమలు చేస్తుంటాయి. దీనికి సంబంధించిన వివరాలు అమలు చేసేటోడికి.. కొందరు కీలక అధికారులకు తప్పించి మిగిలిన వారికి అవగాహనే ఉండదన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకే వస్తుంది. రైల్వే స్టేషన్లలో ఆహారం కొనుగోలు చేయటమంటే ఖర్చుతో కూడుకున్నదన్న విషయం తెలిసిందే.
అయితే.. సామాన్య ప్రజానీకం కోసం దక్షిణ రైల్వే చెన్నై డివిజన్.. ఐఆర్ సీటీసీతో కలిసి అన్ రిజర్వుడ్ కోచ్ లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సౌకర్యం కోసం రూ.20లకే ఆహారాన్ని అందించే ప్రోగ్రాంను అమలు చేస్తున్నారు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఈ పథకం గురించి ఎవరికి అవగాహన ఉండదు. నిజానికి ఇలాంటి పథకాలు పాపులర్ అయితే.. ప్రజలకు మేలు కలుగుతుంది.
చౌక ధరల్లో నాణ్యమైన ఫుడ్ అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని రైల్వే ప్రయాణికులు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇది పరిమిత స్థాయిలో ఉన్న రైల్వే స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉండటంతో.. ఆయా స్టేషన్ల పరిధిలో ప్రయాణించే వారికే మేలు కలుగుతుందని చెప్పాలి. చెన్నై సెంట్రల్.. ఎగ్మూరు.. చెంగల్పట్టు.. కాట్పాడి తదితర రైల్వే స్టేషన్లలో ఈ చౌక ఆహార కేంద్రాల్ని నిర్వహిస్తున్నారు.
ఇంతకూ రూ.20లకే అందించే ఆహారం విషయానికి వస్తే.. పులిహోర, పెరుగన్నం, లెమన్ రైస్, పప్పు కిచిడీ, పూరీ పరోటా లాంటి ఆహారాన్ని అందిస్తున్నారు. మొత్తం 27 రైల్వే స్టేషన్లలో ఈ తరహా చౌకైన 67 ఆహార కేంద్రాల్ని నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని రైల్వే ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ రైల్వే పేర్కొంది. దక్షిణ రైల్వే మాదిరే తెలుగు రాష్ట్రాల పరిధి అత్యధికంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఆ కోణంలో రైల్వే అధికారులు పథక రచన చేయాల్సిన అవసరం ఉంది.