ఆస్తుల్లో చంద్రబాబు ఫస్ట్ కాదు.. సెకండ్!
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల విషయంలో తొలి స్థానంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా రెండో స్థానానికి చేరుకున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల విషయంలో తొలి స్థానంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా రెండో స్థానానికి చేరుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన 900 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులతో ముఖ్యమంత్రుల జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. అయితే.. తాజాగా పలు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం, ముఖ్యమంత్రులుగా కొత్త నేతలు బాధ్యతల్లోకి రావడంతో ఈ వ్యవహారంపై అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ తాజాగా కొత్త జాబితాను విడుదల చేసింది.
తాజా జాబితా ప్రకారం.. దేశంలో అత్యధిక సంపన్న ముఖ్యమంత్రిగా కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిలిచారు. ఈయన ఆస్తులు సుమారు 1400 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు 931 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో నిలిచారు. ఇక, మూడో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నిలిచారు. ఈయన ఆస్తులు సుమారు 620 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. ఆయా వివరాలను వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించడం గమనార్హం.
ఇక, పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈజాబితాలో చివరలో ఉన్నారు. ఆయనకు కేవలం కోటి రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. అది కూడా ఉమ్మడి ఆస్తిగా పేర్కొనడం గమనార్హం. అలానే.. చిన్న రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమా ఖండు ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఈయన ఆస్తులు 332 కోట్ల రూపాయలు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. అయితే.. ఆయన ఆస్తులు కూడా ఉమ్మడిగా ఉన్నాయని తెలిపింది. గతంలో సీఎం చంద్రబాబు ముందుంటే.. కర్ణాటక అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండోస్థానంలో ఉన్నారు. కానీ, ఆయన ఇటీవల రాజీనామా చేసి.. డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగించారు. డీకే కు వ్యాపారాలు, ఇతర భూముల ద్వారా ఆదాయం సమకూరుతున్నట్టు ఏడీఆర్ పేర్కొంది.