ఎలా గెలవాలో తెలుసట...బీజేపీ ఎమ్మెల్యే రచ్చ !

నిజంగా రాయలసీమ అందునా వైసీపీకి కంచుకోట అయిన కర్నూలు జిల్లాలోని సీటు నుంచి బీజేపీ గెలవడం అంటే అది ఆషామాషీ అయితే కాదు.;

Update: 2025-12-07 03:51 GMT

ఎన్నికల్లో గెలుపు అన్నది ఒక మ్యాజిక్. అది ఎలా వస్తుంది అంటే ఎవరికీ తెలియదు, మరీ ముఖ్యంగా ఈ దేశంలో నాయకులు చాణక్య వ్యూహాలు వేస్తారు అని అంతా అనుకుంటారు. కానీ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం ఓటర్ల తెలివి ముందు ఎవరూ పనికి రారు. ఎంత పెద్ద నాయకుడు అయినా జనాలు ఇట్టే ఓడించి వారి ప్లేస్ ఏమిటో చూపిస్తారు. అయితే గెలుపు ఇచ్చే కిక్కు అలాంటిది. అంతే కాదు అధికారం చేతిలో ఉంటే ఆ మజాయే వేరు. చాలానే నోటి నుంచి అనిపిస్తుంది. ఇపుడు ఒక బీజేపీ ఎమ్మెల్యే గారి పరిస్థితి అలాగే ఉంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పార్ధసారధి తన దూకుడుతో కూటమిలో రచ్చ చేస్తున్నారు అని అంటున్నారు.

అదోని ఎమ్మెల్యేగా :

బీజేపీకి చెందిన పార్థసారథి 2024 ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసి గెలిచారు. నిజంగా రాయలసీమ అందునా వైసీపీకి కంచుకోట అయిన కర్నూలు జిల్లాలోని సీటు నుంచి బీజేపీ గెలవడం అంటే అది ఆషామాషీ అయితే కాదు. కానీ వైసీపీ మీద తీవ్రంగా ఉన్న అసంతృప్తి కూటమి పార్టీలు అన్నీ ఐక్యంగా పనిచేయడం, ఒక ప్రభంజనం క్రియేట్ కావడంతో జనాలు కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అలా అద్భుతమైన విజయం దక్కింది. అందులో బీజేపీ ఉంది కాబట్టి సీట్లు దక్కాయి. కానీ ఎవరైనా ఈ గెలుపు తనదని తన సొంతమని అనుకుంటే పొరపాటే. కానీ అదోని ఎమ్మెల్యే పార్ధసారధి మాత్రం తానే సొంతంగా గెలిచాను అని భావిస్తున్నారు అని అంటున్నారు

సవాల్ చేస్తున్నారుగా :

తాను సొంత బలంతోనే గెలిచాను అని భావిస్తున్న పార్ధసారధి ఇటీవల పార్టీ క్యాడర్ తో నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ తనకు ఎలా గెలవాలో తెలుసు అని వ్యాఖ్యానించారు అని అంటున్నారు. తాను ఎవరినీ అసలు పట్టించుకోనని తనకు గెలుపు దారులు తెలుసు అని ఓడించే వారే లేరని కూడా ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. దాంతో ఇది వివాదంగా మారుతోంది. పైగా సోషల్ మీడియా యుగం కావడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయని అంటున్నారు.

టీడీపీని దూరం :

ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అందరినీ కలుపుకుని పోవాల్సిన బీజేపీ ఎమ్మెల్యే వారిని దూరం చేసుకుంటున్నారు అని విమర్శలు ఉన్నాయి. దాంతో టీడీపీ నేతలు ఎమ్మెల్యే తీరు మీద ఆగ్రహంగా ఉంటూ దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు. అదోనికి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా చేసిన మీనాక్షి నాయుడుకు మంచి బలం ఉంది. 2024 ఎన్నికల్లో ఆయనే పోటీ చేయాలని అనుకున్నారు. అయితే కూటమి పార్టీల పొత్తు ధర్మంతోనే ఆయన తన సీటుని వదులుకున్నారు. కానీ గెలిచిన తరువాత బీజేపీ ఎమ్మెల్యే తీరు వేరేగా ఉండడంతో ఆయన వర్గం అయితే గుర్రుగా ఉందని అంటున్నారు. ఇలా అదోనిలో టీడీపీ వర్సే బీజేపీగా రచ్చ సాగుతోంది. దానికి తోడు అన్నట్లుగా ఇపుడు ఎమ్మెల్యే సవాల్ చేస్తున్నట్లుగా చేసిన వ్యాఖ్యలతో మరింత అగ్గి రాజుకుంటోంది అని అంటున్నారు.

ఆయనకు నో :

ఈసారికి ఇలా అయిపోయింది కానీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీకి టికెట్ ఇచ్చినా లేక ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చినా సహకరించేది లేదని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్గం అంతా తెగేసి చెబుతోంది. బహిరంగంగానూ చెబుతోంది అని అంటున్నారు. దాంతో కూటమి పెద్దలకు ఈ రచ్చ పెద్ద తలనొప్పిగా మారింది అని అంటున్నారు. నాయకులు అన్న వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూటమిలో అంతా ఒక్కటిగా ఉండాలని అధినాయకులు చెబుతూంటే దిగువన మాత్రం సీన్ వేరే విధంగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News