వివాదాస్పద మసీదును సందర్శించిన యూసుఫ్ పఠాన్.. మళ్లీ మొదలు!

పశ్చిమ బెంగాల్‌ లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏ.ఎస్.ఐ.) ద్వారా రక్షించబడుతున్న ఆదినా మసీదును మాజీ క్రికెటర్, తృణమూల్ ఎంపీ యూసుఫ్ పఠాన్ సందర్శించారు.;

Update: 2025-10-18 14:30 GMT

పశ్చిమ బెంగాల్‌ లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏ.ఎస్.ఐ.) ద్వారా రక్షించబడుతున్న ఆదినా మసీదును మాజీ క్రికెటర్, తృణమూల్ ఎంపీ యూసుఫ్ పఠాన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆ నిర్మాణం అద్భుతం అని కొనియాడుతూ.. అక్కడి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో చాలా కాలంగా ఉన్న వివాదం మళ్లీ రాజుకుందని అంటున్నారు.

అవును... పశ్చిమ బెంగాల్‌ లోని (వివాదాస్పద) ఆదినా మసీదును యూసఫ్ పఠాన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా ఆ అనుభవాలను, ఫోటోను పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. తన పోస్టులో ఆదినా మసీదును ఒక నిర్మాణ అద్భుతంగా ఆయన అభివర్ణించారు. ఈ సమయంలో బీజేపీ, సోషల్ మీడియా వినియోగదారుల నుంచి స్పందనలు వెల్లువెత్తాయి!

ఈ నేపథ్యంలో బెంగాల్ బీజేపీ స్పందించింది. ఇందులో భాగంగా అది ఆదినాథ్ ఆలయమని, దానిపై మసీదు నిర్మించబడిందని చెప్పుకొచ్చింది! ఆ స్థలంలో గణేష్, శివుడిని పోలిన దేవల స్పష్టమైన చిత్రాలు కూడా ఉన్నాయంటూ వాటిని ఆన్ లైన్ లో పలువురు పోస్ట్ చేశారు! తృణమూల్ ఎంపీ నిర్మాణం మూలాలను విస్మరించారని ఈ సందర్భంగా పలువురు యూజర్స్ ఆరోపించారు!

ఏమిటీ ఆదినా మసీదు వివాదం?:

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రతీంద్ర బోస్ 2022లో.. ఆదినాథ్ మందిరం, మసీదు నిర్మాణం కింద ఖననం చేయబడిందని ట్వీట్ చేశారు. దీంతో ఆలయం - మసీదు వివాదం చెలరేగింది! 'ఆదినాథ్ ఆలయం ఈ ఆదినా మసీదు కింద నిద్రిస్తుంది.. ఆ చరిత్ర చాలా మందికి తెలియదు' అని బోస్ ట్వీట్ చేశారు. తర్వాత 2024లో.. హిందూ పూజారి హిరన్మోయ్ గోస్వామి భక్తుల బృందానికి నాయకత్వం వహించి ఆదినా మసీదు ప్రాంగణంలో పూజలు నిర్వహించారు.

దీంతో ఈ విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని, మతపరమైన అల్లర్లు తలెత్తకుండా నిరోధించారు. ఈ సమయంలో.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తటస్థ వైఖరిని కొనసాగించింది. ఆదినా మసీదు జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా మిగిలిపోయిందని పేర్కొంది. తన సంరక్షణలో ఉంచింది.

Tags:    

Similar News