‘‘పాపం పవన్ ను బలి చేయొద్దు’’ ఆయనకు రాజకీయమే తెలియదు.. కాంగ్రెస్ హాట్ కామెంట్స్
తెలంగాణ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవ నిర్మాణ సభ పెడతానని పవన్ ప్రకటించారు.
తెలంగాణ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవ నిర్మాణ సభ పెడతానని పవన్ ప్రకటించారు. అయితే ఈ సభకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం ఆయనపై మాటల దాడి చేస్తోంది. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్, తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జనసేనానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ రాజకీయాల కోసం పవన్ ను బలి చేయాలని చూస్తోందని ఎమ్మెల్సీ దయాకర్ ఆరోపించారు. పాపం పవన్ కల్యాణ్ ఆయనకు రాజకీయాలు తెలియవు.. మీ రాజకీయాల కోసం పవన్ ను బలి చేయొద్దని కోరుతున్నా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘‘పాపం పవన్ కల్యాణ్ ను బలి చేయొద్దు. ఎందుకంటే ఆయనకు రాజకీయం తెలియదు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ వ్యతిరేకిగా పవన్ పనిచేశారు. ఆ తర్వాత ఆయన సనాతన ధర్మం కోసం పనిచేశారు. ఆ పోరాటం కూడా బీజేపీకి అనుకూలంగానే చేశారు. పవన్ చేగువేరా వారసుడు.. చేగువేరా వారసుడు సనాతన ధర్మం కోసం పోరాడారు. ఇది ఆయనకు ఎలా అనిపించిందో కానీ, తెలుగు ప్రజలు మాత్రం జీర్ణించుకోలేకపోయారు’’ అంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి పవన్ చిచ్చుబుడ్డి పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధితో దూసుకుపోతోందని దయాకర్ వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో పవన్ చిచ్చుబుడ్డితో వైషమ్యాలు తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, అలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం అనుమతించదని ఆయన స్పష్టం చేశారు. దీంతో పవన్ నిర్వహించతలపెట్టిన ‘నవ నిర్మాణ సభ’ను ప్రభుత్వమే అడ్డుకుందని పరోక్షంగా తేల్చిచెప్పారని అంటున్నారు.
ప్రధాని మోదీ వచ్చి వెళ్లిన తర్వాత ఏదో మార్పు జరుగుతుందని బీజేపీ నేతలు ప్రచారం చేశారని, టార్గెట్ తెలంగాణ అంటూ ప్రకటనలు చేశారని ఎమ్మెల్సీ అద్దంకి వ్యాఖ్యానించారు. బీజేపీ టార్గెట్ తెలంగాణ అంటే వైషమ్యాలు తీసుకురావడమేనా? దీనికి పవన్ కల్యాణ్ ను వాడుకుంటారా? అంటూ ఎమ్మెల్సీ దయాకర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ వస్తే 11 రోజులు భోజనం చేయలేకపోయారని.. తెలంగాణ నేతలు కళ్లు పడితే కోనసీమ భగ్గుమని మండిపోయిందని చెప్పిన పవన్ చెప్పారని దెప్పిపొడిచారు. జూన్ 2 అంటే తెలంగాణకు ఒక పండుగ అని అలాంటి రోజున వైషమ్యాలు పెంచే సభలు, ప్రెస్ మీట్ లకు ఎందుకు అనుమతిస్తామని అద్దంకి వ్యాఖ్యానించారు.