ఆ నాయకుడి వల్లే డ్రగ్స్ అలవాటైంది.. హీరో సంచలన వ్యాఖ్యలు

మృదువైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.;

Update: 2025-06-25 07:49 GMT

మృదువైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తన డ్రగ్స్ అలవాటుకు కారణం మాజీ ఏఐఏడీఎంకే నేత ప్రసాద్ అని ఆయన కోర్టులో చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో మరింత సంచలనం రేపాయి.

- కోర్టులో నేరాన్ని అంగీకరించిన శ్రీరామ్

చెన్నై సుంగంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలో హీరో శ్రీరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆయన రెండు సార్లు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించి పుళల్ జైలుకు తరలించారు. కోర్టులో శ్రీరామ్ తన వాంగ్మూలంలో "డ్రగ్స్ వాడటం నా తప్పు ఒప్పుకుంటున్నాను. కానీ ఈ అలవాటు నాకు ప్రసాద్ వల్లే వచ్చింది. నాకు ఆయన ₹10 లక్షలు ఇవ్వాలి. ప్రతిసారి డబ్బు అడిగినప్పుడు డబ్బుకు బదులు కొకైన్ ఇచ్చేవాడు. మొదట నేను నిరాకరించినా క్రమంగా అలవాటు అయిపోయింది. చివరికి నేనే డ్రగ్స్ అడిగే పరిస్థితికి వచ్చాను. నా కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. దయచేసి బెయిల్ మంజూరు చేయండి" అని కోరారు.

- కీలక సూత్రధారి ప్రసాద్‌?

పోలీసుల దర్యాప్తులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీరామ్‌కు ప్రసాద్ మాధ్యమం ద్వారా డ్రగ్స్ సరఫరా అయ్యేవని, ఈ క్రమంలో ప్రదీప్ అనే వ్యక్తి పేరు బయటపడింది. ప్రదీప్, ప్రసాద్ నుంచి 40 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రదీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతని వాంగ్మూలం ఆధారంగా శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు.

- సినీ ప్రయాణం.. ఊహించని మలుపు

తిరుపతికి చెందిన శ్రీరామ్ "రోజా కూటం" సినిమాతో తమిళంలో అరంగేట్రం చేశారు. ఈ సినిమా తెలుగులో “రోజా పూలు” పేరుతో విడుదలై మంచి పేరు తెచ్చింది. తెలుగులో శ్రీకాంత్ అనే ప్రముఖ నటుడు ఉండటంతో తన అసలుపేరు మార్చుకుని శ్రీరామ్‌గా కొనసాగాడు. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే", "లై", "పోలీస్ పోలీస్", "నిప్పు", "దడ", "రావణాసుర", "పిండం" వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

- సినీ పరిశ్రమకు దెబ్బ

శ్రీరామ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం తమిళ, తెలుగు పరిశ్రమల్లో కలకలం రేపింది. అందరికీ సౌమ్యుడిగా కనిపించే ఈ నటుడు ఇలాంటి కేసులో చిక్కుకోవడం అభిమానులనే కాక, సహనటులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. డ్రగ్స్ వంటి వినాశకరమైన వలలో ఒక ప్రతిభావంతుడైన నటుడు చిక్కుకోవడాన్ని పరిశ్రమలోని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

శ్రీరామ్ అరెస్ట్ కేసు కేవలం ఒక వ్యక్తిగత తప్పే కాదు.. ఇది సినీ రంగంలోకి మత్తు పదార్థాలు ఎలా చొరబడుతున్నాయో తెలిపే ఒక ఘటన.. ఇలాంటి ఘటనలు పరిశ్రమపై నీడ వేయకుండా ఉండాలంటే, కఠిన చట్టాలతో పాటు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత కూడా అవసరం. ఇప్పుడు ఈ కేసులో మరోసారి విచారణ కొనసాగనుండగా, ప్రసాద్‌పైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీసులపై ఉంది.

Tags:    

Similar News