వయసు 70.. మనసు 20.. మాజీ మంత్రి మాట విన్నారా ..!
ఉదాహరణకు సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ వంటి వారికి మాత్రమే వయసుతో నిమిత్తం లేకుండా రాజకీయాలు చేయగల సత్తా సొంతమైంది.
రాజకీయాలకు వయసుతో సంబంధం లేదని కొందరుఅంటారు. కానీ.. ప్రజల మధ్య తిరగాలంటే.. వారితో మమేకం కావాలంటే.. వారిసమస్యలపై పోరు చేసైనా కూడా.. పరిష్కరించాలంటే.. వయసు కీలకంగా ఉంటుంది. ఇది ఏ కొద్దిమందికో మాత్రమే వర్కవుట్ అవుతుంది. ఉదాహరణకు సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ వంటి వారికి మాత్రమే వయసుతో నిమిత్తం లేకుండా రాజకీయాలు చేయగల సత్తా సొంతమైంది. కానీ, వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు.. మాత్రం తన రాజకీయాలు ముగియలేదని చెబుతున్నారు.
పోనీ.. ఆయన వయసేమైనా.. 40-60 మధ్య ఉందా అంటే.. కాదు. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి 75కు చేరుకుంటారు. అయినా.. కూడా తన పులుపు తగ్గలేదని చెబుతున్నారు. ఆయనే మాజీ మంత్రి, ఆచంట నుంచి గతంలో విజయం దక్కించుకున్న చెరుకువాడ శ్రీరంగ నాథరాజు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు స్థానికంగా మంచి పేరుంది. వ్యాపారాలు కూడా బాగానే సాగుతు న్నాయి. కూటమి హయాంలో కూడా జోరుగానే ముందుకు సాగుతున్నారు.
కానీ, ఆయన వయసు ఇప్పుడు ఆయనకు అడ్డంకిగామారుతోందని అంటున్నారు. కానీ, ఆయన మాత్రం తనకు వయసుతో నిమిత్తం లేదని.. తాను 20 ఏళ్ల యువకుడి మాదిరిగానే ఉంటున్నానని చెబుతున్నారు. వాస్తవం చూస్తే.. క్షేత్రస్థాయిలో పర్యటించలేక పోతున్నారు. పట్టుమని గంట సేపు కూడా నిలబడలేక పోతున్నారు. ఒక పూట ప్రజల మధ్య తిరుగుతున్నారా? అంటే.. అది కూడా లేదు. దీంతో రంగనాథరాజు స్థానంలో కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిని తప్పుబడుతున్న రంగనాథ రాజు.. తనకు భౌతికంగా 70 ఏళ్లు నిండినా.. తాను యువకులతో ఏమా త్రం తీసిపోనని అంటున్నారు. ఇదిలావుంటే.. ఆచంటలో వైసీపీ పెద్దగా దూకుడు ప్రదర్శించలేక పోతోం ది. పైగా.. రాజకీయంగా కీలకమైన ఆచంటలో క్షత్రియ సామాజిక వర్గం మాత్రమేకాకుండా.. ఇతర సామాజి క వర్గాలను కూడా వైసీపీ ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. చెరుకువాడ మాత్రం.. జిల్లా కేంద్రంలో ఉండి.. నియోజకవర్గంపై ఆరా తీస్తున్నారు. అయితే.. ఆర్థికంగా ఆయన బలంగా ఉన్న నేపథ్యంలో తిరిగి ఆయనకే టికెట్ దక్కే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.