ఏబీవీ 'అజెండా' సక్సెస్ అయ్యేనా ..!
ఒకటి.. ఇటీవల చంద్రబాబు ఆయనకు రెండు రకాల మేళ్లు చేశారు. ఆయన ను వైసీపీ సస్పెండ్ చేసి.. నాలుగేళ్లకు పైగానే పక్కన పెట్టింది.;
మాజీ ఐపీఎస్ అధికారి.. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్.. ఏబీ వెంకటేశ్వరరావు.. రాజకీయాల్లోకి వచ్చారు. ``తక్షణమే నేను రాజకీయాల్లోకి వస్తున్నా`` అని ఆదివారం రాత్రి ఆయన చేసిన ప్రకటనతో ఆయన రాజకీయంగా యాక్టివ్ అయ్యారనే చెబుతున్నారు పరిశీలకులు. అయితే.. ఆయన ఎంచుకున్న ఏకైక అజెండా జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాకూడదనే! ఇది నిజానికి కూటమి పార్టీలకు ఆనందం కలిగించే విషయమే.వారు కూడా ఇదే కోరుకుంటున్నారు.
జగన్ మళ్లీ సీఎం కాకూడదనే.. చంద్రబాబు మళ్లీమళ్లీ ముఖ్యమంత్రి కావాలనే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నుంచి టీడీపీ, జనసేన నాయకులు కోరుకుంటున్నారు. ఈ విషయం బహిరంగ రహస్యమే. అయితే.. ఏబీవీ ఇంత పెద్ద ప్రకటన చేసిన తర్వాత కూడా.. కూటమి పార్టీల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఎవరూ ఆయనకు అనుకూలంగా కానీ.. మద్దతుగా గానీ.. ఒక్క ప్రకటన కూడా చేయలేదు. మరి ఈ నేపథ్యంలో ఏబీవీ అజెండా సక్సెస్ అవుతుందా? అన్నది ప్రశ్న.
ఇక, ఏబీవీ విషయానికి వస్తే.. ఆయన విషయంలో రెండు కీలక అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. ఇటీవల చంద్రబాబు ఆయనకు రెండు రకాల మేళ్లు చేశారు. ఆయన ను వైసీపీ సస్పెండ్ చేసి.. నాలుగేళ్లకు పైగానే పక్కన పెట్టింది. ఈ కాలంలో ఆయనకు వేతనం కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఆయన కోరకుండానే.. చంద్రబాబు స్పందించి. ఇటీవల 4 కోట్ల రూపాయలను ఆయనకు బకాయిల రూపంలో ఉన్నవి చెల్లించేశారు. ఆ వెంటనే ఆయనను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌కు చైర్మన్ ను చేశారు.
కానీ.. డబ్బులు తీసుకున్న ఏబీవీ.. పదవిని మాత్రం తీసుకోలేదు. ఇది జరిగి నెల రోజులు అయినా.. ఆయన నామినేటెడ్ పదవి బాధ్యతలు తీసుకోలేదు. దీంతో చంద్రబాబును ఆయన ధిక్కరించారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే.. టీడీపీ సానుకూల మీడియా తాజాగా ఆయన చేసిన ప్రకటనను ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక, రెండోది కీలకమైంది.. జగన్‌పై దూకుడు పెంచి.. కేసులు నమోదు చేసి.. కోర్టుకుఈడుస్తానని ఏబీవీ చెప్పారు.
ఈ విషయంలో కూటమి సర్కారు ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇలా చేస్తే.. జగన్‌కు సామాజికంగా సింపతీ వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిస్థాయిలో ఆయనపై చర్యలు తీసుకుంటే.. లేనిపోని ఓటు బ్యాంకును పెంచినట్టు అవుతుంది. అందుకేఏబీవీ ఇంత పెద్ద ప్రకటన చేసి.. రెండు గంటలపాటు మీడియాతో మాట్టాడినా.. స్పందన లేకుండా పోయింది. కాబట్టి ఆయన అజెండా ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.