"ముంబై, ఢిల్లీపై అణు దాడి తప్పదు".. పాకిస్థాన్ మాజీ రాయబారి వ్యాఖ్యలపై దుమారం

బాసిత్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఇదంతా కేవలం ఒక 'హైపోతెటికల్ సీనారియో' మాత్రమేనని స్పష్టం చేశారు.;

Update: 2026-03-22 08:49 GMT

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన పరోక్ష హెచ్చరికలు దౌత్యపరమైన వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

ఉద్రిక్తతల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం అంచునకు తీసుకెళ్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడంతో అమెరికాకు ఇంకా ఏఏ దేశాలతో ముప్పు ఉందన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి తులసీ గబ్బార్డ్ ఏకంగా పాక్ వద్ద అణ్వస్త్రాలున్నాయి.. వాటితో పాక్ కు ముప్పు తప్పదని హెచ్చరించారు. దీనిపై అబ్దుల్ బాసిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా గనుక పాకిస్థాన్‌పై దాడికి దిగితే తాము భారత్‌పై ఎదురుదాడికి దిగుతామని ఆయన పేర్కొనడం గమనార్హం.

"మమ్మల్ని ఎవరైనా తాకితే, మేము ఊరుకోము. అమెరికా గనుక మాపై దాడి చేస్తే, మాకు ప్రత్యామ్నాయం లేక భారత్‌ను లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తుంది. ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలపై దాడులు తప్పవు." అని బాసిత్ వ్యాఖ్యానించారు.

హైపోతెటికల్ సీనారియో.. కానీ ఆందోళనకరం

బాసిత్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఇదంతా కేవలం ఒక 'హైపోతెటికల్ సీనారియో' మాత్రమేనని స్పష్టం చేశారు. అమెరికా పాకిస్థాన్‌పై దాడి చేసే అవకాశం వాస్తవానికి లేదని.. ఒకవేళ అలాంటి అసాధారణ పరిస్థితి ఎదురైతే పాక్ అనుసరించే వ్యూహం ఎలా ఉంటుందో మాత్రమే తాను వివరించానని ఆయన చెప్పుకొచ్చారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన ఒక మాజీ దౌత్యవేత్త నోటి నుండి "అణు దాడులు", "భారత్ లక్ష్యం" వంటి పదాలు రావడం భారత భద్రతా వర్గాలను అప్రమత్తం చేసింది. గతంలో 2014 నుండి 2017 వరకు న్యూఢిల్లీలో పాకిస్థాన్ హైకమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న బాసిత్, రెండు దేశాల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాల గురించి అవగాహన ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే చర్చ మొదలైంది.

భారత్–పాక్ సంబంధాలపై ప్రభావం

బాసిత్ వ్యాఖ్యలు పాత గాయాలను మళ్లీ రేపుతున్నాయి. ఉగ్రవాదం, సరిహద్దు ఉల్లంఘనల వల్ల ఇప్పటికే రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. తన వ్యాఖ్యల చివరలో బాసిత్ సర్దిచెప్పుకుంటూ భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని రెండు దేశాలు శాంతియుతంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ పశ్చిమాసియా సంక్షోభం విషయంలో సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. అయితే, బాసిత్ చేసిన ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాకిస్థాన్ ద్వంద్వ నీతిని మరోసారి బయటపెట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలకు భారత్‌ను ముడిపెట్టడం, అది కూడా అణు దాడుల ప్రస్తావన తీసుకురావడం అంతర్జాతీయ దౌత్య మర్యాదలకు విరుద్ధం. బాసిత్ వ్యాఖ్యలు కేవలం పబ్లిసిటీ కోసమా లేక పాకిస్థాన్ అంతర్గత వ్యూహంలో భాగమా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వేదికలపై హాట్ టాపిక్‌గా మారాయి.

Tags:    

Similar News