ఏబీవీకి బిగ్ రిలీఫ్.. చంద్రబాబుపై అలకతో సాధించిన రిటైర్డ్ డీజీపీ!
గత ప్రభుత్వంలో నమోదు చేసిన ఏసీబీ కేసు నుంచి ఏబీవీకి పూర్తి విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.;
రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. మంచి ప్రభుత్వంలో తనకు న్యాయం చేయడంలో ఏడాదిగా ఆలస్యం జరుగుతోందని ఇటీవల ఏబీవీ అలక వహించినట్లు ప్రచారం జరిగింది. టీడీపీకి అనుబంధంగా పనిచేస్తున్న కొందరు జర్నలిస్టులు ఆయనపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎక్స్ లో స్పందించిన ఏబీవీ సుదీర్ఘ పోస్టు రాశారు. తాను కష్టాల్లో ఉండగా, ఏ టీడీపీ నేత పట్టించుకోలేదని, తనకు రావాల్సిన జీతం బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పటివరకు చెల్లించలేదని వాపోయారు. అదేవిధంగా జగన్ ప్రభుత్వం తనపై అన్యాయంగా నమోదు చేసిన కేసులను ఎదుర్కొనేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏబీవీ చేసిన ఈ పోస్టు టీడీపీని బాగా కదలించినట్లు చెబుతున్నారు. దీంతో ఆయనపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను పూర్తిగా ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
గత ప్రభుత్వంలో నమోదు చేసిన ఏసీబీ కేసు నుంచి ఏబీవీకి పూర్తి విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీవీ పిటిషనుపై హైకోర్టు నిర్ణయాన్ని అంగీకరిస్తూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2018లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఏబీవీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం 2021లో ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే తనపై చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని, అసలు పరికరాలే కొనుగోలు చేయలేదంటూ వెంకటేశ్వరరావు 2022లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏబీవీ వాదనలను సమర్థించింది. ఏసీబీ కేసును క్వాష్ చేసింది. అయినప్పటికీ 2024లో విజయవాడ ఏసీబీ కోర్టులో గత ప్రభుత్వ ఒత్తిడితో ఏసీబీ అధికారులు ఏబీవీపై చార్జిషీట్ దాఖలు చేశారు. హైకోర్టు క్వాష్ చేసిన తర్వాత చార్జిషీట్ చెల్లదంటూ బెజవాడ ఏసీబీ కోర్టు దాన్ని తిరస్కరించింది. అయితే ఇప్పుడు ఏబీవీపై గత ప్రభుత్వం దాఖలు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏబీవీకి క్లీన్ చిట్ లభించినట్లైంది. ఎన్నికల ముందు సర్వీసు నుంచి రిటైర్ అయిన ఏబీవీ అంతకు ముందు ఐదేళ్లపాటు ఎలాంటి పోస్టింగు లేకుండా గడిపారు.
అదే సమయంలో ఐదేళ్లలో రెండుసార్లు సస్పెన్షన్ కు గురయ్యారు. ఒకవైపు కేసులు, మరోవైపు సస్పెన్షన్లపై ఆయన సుదీర్ఘ న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. అయితే ఈ పరిస్థితుల్లో తనకు టీడీపీ నుంచి పెద్దగా సహకారం లభించలేదన్న ఆవేదనతో కూటమి ప్రభుత్వంలో పోలీసు హౌసింగు బోర్డు చైర్మన్ పదవిని కూడా తీసుకోలేదు. మరోవైపు మాజీ సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఏబీవీ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వంపైనా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. అయితే టీడీపీ సోషల్ మీడియా ఏబీవీకి మద్దతుగా నిలవడం, పార్టీ కూడా ఆయన విషయంలో తప్పుడు సంకేతాలు వెళుతున్నట్లు గ్రహించడంతో సమస్య పెద్దది కాకుండా చూడాలని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.