5 నెలల్లో 85,000 వీసాల రద్దు.. ట్రంప్ తలుచుకుంటే అంతే మరీ!

ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ చివరి ఐదు నెలల్లోనే ఏకంగా 85000 వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.;

Update: 2025-12-09 12:53 GMT

కో అంటే కొండ మీద కోతి అయినా దిగి రావాల్సిందే.. అధికారంలో ఉంటే ఏదైనా సాధ్యమే. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తలుచుకుంటే అమెరికాలో ఏదైనా సాధ్యమే. అధికారం అప్పగించినందుకు ట్రంప్ ఏది చేసినా అనుభవించాల్సిందే.. అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పట్టపగ్గాల్లేకుండా రెచ్చిపోతున్నారు. ఆయనకు ముకుతాడు వేసేవారే లేకుండా పోయారు. ‘తా వలచింది రంభ’ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా వలస విధానాలు, వీసా నిబంధనలను ఊహించని విధంగా కఠినతరం చేసి విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నాడు.

ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ చివరి ఐదు నెలల్లోనే ఏకంగా 85000 వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్య కావడం గమనార్హం. రద్దు చేసిన వీసాలలో 8000 పైగా స్టూడెంట్ వీసాలు ఉండడం అంతర్జాతీయ విద్యార్థులలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది.

వీసాల రద్దుకు స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రధానంగా ‘అమెరికాలో అక్రమ నివాసం ఉన్న వారిని.. నేర కార్యకలాపాలు చేసిన వారిని.. ప్రజాభద్రతకు ముప్పు, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన వారిని వీసాలు రద్దు చేసి పంపిస్తోంది. గత ఏడాది రద్దు చేసిన వీసాలలో దాదాపు సగం మద్యం సేవించి డ్రైవింగ్ దాడులు, దొంగతనాలకు సంబంధించినవే కావడం గమనార్హం.

వీసా హోల్డర్ల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కొత్త విధానం అమలు చేస్తోంది. నిరంతర తనిఖీలు చేస్తూ హడలెత్తిస్తోంది. గత ఆగస్టులోనే స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారులు సుమారు 5.5 కోట్ల మంది వీసా హోల్డర్లపై నిరంతరం తనిఖీలు జరుపుతామని ప్రకటించారు. పోలీసు రికార్డులు, ఇమిగ్రేషన్ వివరాలు, అత్యంత ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నారు.

జూన్ నెలలో అమెరికా దౌత్య కార్యాలయాలకు అందిన ఆదేశాల ప్రకారం.. స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసే ప్రతీ ఒక్కరూ తమ సోషల్ మీడియా అకౌంట్లను పబ్లిక్ గా ఉంచాల్సి ఉంటుంది. అమెరికా సంస్కృతి, వ్యవస్థలపై వైరం చూపే కంటెంట్ అకౌంట్లలో ఉంటే వీసా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని స్పష్టంగా హెచ్చరించారు.

గాజా యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు చేసిన అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కొంతమంది విద్యార్థులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారని ఆరోపిస్తూ వారి వీసాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం.. కంటెంట్ మోడరేషన్, ఫ్యాక్ట్ చెకింగ్ వంటి పనుల్లో ఉన్న విదేశీయులను కూడా హెచ్1 బీ కింద కఠినంగా పరిశీలిస్తున్నారు. విదేశీయులు అమెరికన్లను సెన్సార్ చేస్తే వీసాలపై ఆంక్షలు విధిస్తామని మార్కో రుబియో ప్రకటించడం ఈ విధానాల తీవ్రతను తెలియజేస్తుంది.

ట్రంప్ రెండో పాలనలో అమెరికా వీసా విధానం ఏ ఒక్క విభాగానికి మినహాయింపు లేకుండా ప్రస్తుతం అత్యంత కఠినంగా మారింది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, శరణార్థులు ఎవరైనా సరే ఒక అమెరికా ప్రవేశం అంత సులభం కాదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఎలా ఉందంటే.. వీసాలు పొందడం కంటే వాటిని అమెరికాలో ఉంటూ నిలబెట్టుకోవడమే ఇప్పుడు పెద్ద పరీక్షగా మారిందని తాజాగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News