ఆసేతు హిమాచలం.. వరదలతో అల్లకల్లోలం.. 60 మంది బలి

భారీ వర్షాలతో ఆకస్మిక వరదల కారణంగా హిమాచల్ కొన్ని రోజుల్లోనే 63 మంది ప్రాణాలు కోల్పోయారు.;

Update: 2025-07-04 11:01 GMT

హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ వరదలతో అల్లాడుతోంది.. ఇప్పటికే తీవ్రంగా అల్లకల్లోలం అయిన ఈ రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాల ముప్పు ఉందనే కథనాలు బెంబేలెత్తిస్తున్నాయి. భారీ వర్షాలు ఏ రాష్ట్రంలో అయినా కురుస్తాయి. అయితే, హిమాచల్ అలా పడితేనే ప్రమాదం. ఎందుకంటే హిమాలయాలకు తోడు భారీ కొండల నుంచి రాళ్లు పడడంతో ప్రాణ నష్టం సంభవిస్తూ ఉంటుంది. వాస్తవానికి దాదాపు జూన్ వరకు హిమాచల్ ప్రదేశ్ టూరిస్ట్ స్పాట్. ఆపై వర్షాలు మొదలవుతాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది.

భారీ వర్షాలతో ఆకస్మిక వరదల కారణంగా హిమాచల్ కొన్ని రోజుల్లోనే 63 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గల్లంతయ్యారని చెబుతున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.400 కోట్ల నష్టం వాటిల్లింది. ఇంకా ఎక్కువే నష్టం ఉండొచ్చని.. తుది లెక్కల తర్వాతే కచ్చితంగా చెప్పగలం అని అంటున్నారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే మండిలో 17, కాంగ్రాలో 13, చంబాలో ఆరుగురు, సిమ్లాలో ఐదుగురు చనిపోయారు. అత్యంత ఎక్కువగా నష్టపోయింది మందినే. ఈ జిల్లాలోని తునాగ్, బాగ్సాయెద్ లు వర్షాలు ముంచెత్తతున్నాయి. ఈ జిల్లాలోనే 40 మంది గల్లంతు అయినట్లు కథనాలు వస్తున్నాయి.

వందలమందికి గాయాలు కాగా.. అంతే సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 14 వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే విద్యుత్తు సరఫరా నిలిచిపోయి వేలాదిమంది చీకట్లో మగ్గుతున్నారు. కొండలు అధికంగా ఉండే హిమాచల్ లో ప్రతిసారీ వర్షాల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. రాకపోకలు కూడా నిలిచిపోవడంతో ప్రజలకు సాయం అందించడం కూడా ఇబ్బందిగా మారుతుంది.

హిమాచల్ లో బియాస్ ప్రధాన నది. దీంతోపాటు కుండపోత వర్షాలకు చాలా నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వర్షాలకు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున 400 పైగా రోడ్లను మూసివేశారు. కాగా, పలు జిల్లాలకు భారత వాతరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    

Similar News