2 వేల నోట్లు ఉపసంహరణకు మరో 5 రోజులే..

మరో ఐదు రోజుల్లోనే ఈ గడువు ముగియనుండడంతో ప్రజలు తమ దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంకులలో, ఆర్బిఐ శాఖలలో జమ చేసేందుకు క్యూ కడుతున్నారు.

Update: 2023-09-25 14:34 GMT

2016 లో 500, 1000 రూపాయల నోట్లను ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్తుగా రద్దు చేయడం పెను సంచలనం రేపింది. ఆ తర్వాత కొత్త 500, 2000 రూపాయల నోట్లు చలామణిలో వచ్చేవరకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే, నల్లధనం అరికట్టేందుకే పెద్ద నోట్ల రద్దు చేశానని చెబుతున్న మోడీ...2000 రూపాయల నోట్లు మాత్రం కొనసాగించడంపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే 2000 నోట్ల ఉపసంహరణకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 తేదీ లోపు 2000 రూపాయల నోట్లను బ్యాంకులలో జమ చేసుకునేందుకు, మార్చుకనేందుకు గడువు విధించింది.

మరో ఐదు రోజుల్లోనే ఈ గడువు ముగియనుండడంతో ప్రజలు తమ దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంకులలో, ఆర్బిఐ శాఖలలో జమ చేసేందుకు క్యూ కడుతున్నారు. మరో 6 రోజుల్లోనే 2000 నోట్ల ఉపసంహరణ గడువు ముగియనుండంతో గడువు మరోసారి పొడిగిస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠత ఏర్పడింది. ఏ బ్యాంకు శాఖలో అయినా రోజుకు 20 వేల రూపాయల విలువైన 2000 నోట్లను మార్చుకునే అవకాశం ఆర్బీఐ కల్పించింది. సేవింగ్స్ అకౌంట్, జన్ ధన్ ఖాతాలో డిపాజిట్లకు ఎటువంటి పరిమితి లేదు. 50 వేల రూపాయల పైచిలుకు డిపాజిట్ చేయాల్సి వస్తే పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.

Read more!

సెప్టెంబర్ 25 నుంచి 30వ తేదీ వరకు ఆరు రోజుల నిడివిలో ఒకరోజు సెలవు రాబోతోంది. దీంతో ఐదు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి 7 శాతం 2000 రూపాయల నోట్లు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 తర్వాత 2000 నోటు ఉపసంహరణపై ఆర్బిఐ ఏ నిర్ణయం తీసుకోబోతోంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది. కేవలం ఆర్బిఐ శాఖల వద్ద నోట్లను మార్చుకునేందుకు అనుమతించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Tags:    

Similar News