పులివెందులలో జగన్ కు షాక్.. ఇందులో నిజం ఎంత?

అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్లుగా మారిపోతున్న రాజకీయాల్ని చూస్తే.. ఇదేం ఖర్మరా బాబు అనుకోకుండా ఉండలేం.;

Update: 2025-12-01 04:30 GMT

అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్లుగా మారిపోతున్న రాజకీయాల్ని చూస్తే.. ఇదేం ఖర్మరా బాబు అనుకోకుండా ఉండలేం. ఒక చిన్న రాజకీయ ఘటన.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ అన్నట్లుగా అభివర్ణించటం చూస్తే..తెలుగు రాజకీయాలకు.. మీడియాకు ఏమైంది? అనుకోకుండా ఉండలేం. ఇంతకూ పులివెందులలో ఏం జరిగింది. ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డికి నిజంగానే బిగ్ షాక్ అవుతుందా?అందులో నిజం ఎంత? అన్నది చూస్తే..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పెట్టని కోటలా ఉండటమే కాదు తిరుగులేని అధిక్యతను కట్టబెట్టే పులివెందుల నియోజకవర్గాన్ని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నియోజకవర్గానికి చెందిన 200 మంది మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ ఘటన జగన్ కు బిగ్ షాక్ అంటూ అభివర్ణిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ మైనార్టీ కుటుంబాలు వైసీపీని వదిలేసి.. టీడీపీ కండువాలు కప్పుకున్నారు.

పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లి మండల కేంద్రానికి చెందిన 200మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమాలు జరిగింది. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ.. వేంపల్లి డెవలప్ మెంట్ కు కూటమి సర్కారు పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

తమ కార్యకర్తల్ని సర్పంచ్ లు.. ఎంపీటీసీ.. జెడ్పీటీసీలుగా చేసే వరకు తాము విశ్రమించనని పేర్కొన్న ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులలో పార్టీ విజయమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. అధికారం చేతిలో లేనప్పుడు ఈ తరహా చేరికలు మామూలే. భవిష్యత్తులో చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి చెందిన ఏ ఒక్కరు బయటకు వెళ్లకుండా ఉంటే అది అసలైన గెలుపు. అంతే తప్పించి.. కొందరిని టార్గెట్ చేసుకొని.. వారిని పార్టీలో చేర్పించటమే ముఖ్యమన్నట్లుగా అధికార పక్ష నేతలు వ్యవహరిస్తే.. ఇలాంటి సీన్లు మామూలే. దీనికే జగన్ కు భారీ షాక్ అంటూ పేర్కొనే వ్యాఖ్యల్లో పస ఉండదన్న విషయాన్ని గుర్తించటం చాలా అవసరం.

Tags:    

Similar News