19 ఏళ్ల వయస్సులోనే 180 మందిపై లైంగికదాడి.. బాలుడి ప్రవర్తనపై షాక్..!

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కామాంధుల వికృత చేష్టలు ఏ స్థాయికి చేరుతున్నాయో ఈ పరత్వాడ-అచల్పూర్ ఘటన చూస్తుంటే అర్థం అవుతోంది.;

Update: 2026-04-15 04:47 GMT

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కామాంధుల వికృత చేష్టలు ఏ స్థాయికి చేరుతున్నాయో ఈ పరత్వాడ-అచల్పూర్ ఘటన చూస్తుంటే అర్థం అవుతోంది. కేవలం 19 ఏళ్ల వయసున్న ఒక యువకుడు, ఏకంగా 180 మంది బాలికల జీవితాలతో ఆడుకోవడం, వారి ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టడం సైక్రియాస్ట్రిస్టులను సైతం తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

19 ఏళ్ల యువకుడి పైశాచికం..

అమరావతి జిల్లాలోని పరత్వాడ అచల్పూర్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఉదంతం, ప్రస్తుత తరం యువత సోషల్ మీడియా మాయలో ఎంతటి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారో చెప్పేందుకు ఒక ఉదాహరణ. 19 ఏళ్ల అబ్బాయి ప్రేమ అనే ముసుగులో 180 మంది బాలికలను తన వలలో వేసుకొని, సుమారు 350కి పైగా ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇది కేవలం ఒక నేరం మాత్రమే కాదు, వందలాది కుటుంబాల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య.

తియ్యగా మాట్లాడుతూ వల

ఈ నిందితుడు అనుసరించిన విధానం ప్రమాదకరమైనది. మొదట సోషల్ మీడియాలో పరిచయం పెంచుకోవడం, ఆపై తీయగా మాటలతో యువతులను బుట్టలో వేసుకోవడం అతని స్టయిల్. టీనేజ్ వయసులో ఉండే బాలికల భావోద్వేగాలను అతను ఆయుధంగా వాడుకున్నాడు. నమ్మకం కుదిరిన తర్వాత, వీడియో కాల్స్ లేదంటే ఏకాంతంగా ఉన్న సమయంలో వారి ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసేవాడు. ఒకసారి వీడియో చేతికి చిక్కాక, వాటిని సోషల్ మీడియాలో పెడతానని భయపెట్టి మరింతగా లోబరుచుకోవడం లేదంటే మానసిక వేధింపులకు గురిచేయడం చేసేవాడు. 350 వీడియోలు బయటకు వచ్చాయంటే.., అతని వికృత చేష్టలు ఎంత కాలం నుంచి సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

వ్యవస్థను కుదిపేస్తున్న గణాంకాలు

ఒక చిన్న ప్రాంతంలో ఇంత భారీ సంఖ్యలో బాలికలు ఒకే వ్యక్తి చేతిలో మోసపోవడం సమాజంలో అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తోంది. పరువు పోతుందనే భయంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం నిందితుడికి వరంగా మారింది. దీనివల్ల అతను ఒక్కొక్కరినీ లక్ష్యంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే 350కి పైగా వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడం వల్ల ఆ బాలికల మానసిక పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. వారిని సమాజంలో తలెత్తుకోకుండా చేసే ఈ చర్య అక్షరాలా 'డిజిటల్ హత్య' లాంటిదే.

పాఠశాల స్థాయి నుండే అవసరం!

ఇలాంటి కేసులు పదేపదే నమోదవుతున్నా.. యువత మళ్లీ మళ్లీ అవే తప్పులు చేయడం ఆందోళనకరం. ఆన్‌లైన్‌లో ఎవరిని నమ్మాలి..? ఎవరికి ఎంత వరకు యాక్సెస్ ఇవ్వాలి..? అనే దానిపై సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే దీనికి కారణం. స్మార్ట్‌ఫోన్ వాడడం తెలిసిన ప్రతి ఒక్కరికీ 'డిజిటల్ భద్రత' గురించి కూడా తెలియాలి. ప్రైవేట్ కంటెంట్‌ను షేర్ చేయడం వల్ల జరిగే విపరీత పరిణామాల గురించి పాఠశాలలు, తల్లిదండ్రులు పిల్లలకు స్పష్టంగా వివరించాలి.

తల్లిదండ్రుల పాత్ర, పోలీసుల చర్యలు

పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు..? వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు వచ్చాయా? అని గమనించడం తల్లిదండ్రుల కనీస బాధ్యత. భయం, ఒత్తిడి కారణంగా బాధితులు కొన్నిసార్లు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాల వైపు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి, వారికి భరోసా ఇచ్చి న్యాయపరంగా ముందుకు వెళ్లేలా ధైర్యం చెప్పాలి. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా, ఆ వీడియోలు ఇంకా ఎక్కడైనా సర్క్యులేట్ అవుతున్నాయేమోనని సైబర్ సెల్ సాయంతో దర్యాప్తు వేగవంతం చేశారు.

19 ఏళ్ల వయసులోనే ఇంతటి నేర స్వభావం కలిగిన వ్యక్తికి చట్టం అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. అప్పుడే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే ఇతరుల్లో వణుకు పుడుతుంది. ఆన్‌లైన్ ప్రపంచంలో ‘నమ్మకం’ అనేది ఒక మాయాజాలమని, జాగ్రత్తగా ఉండకపోతే జీవితాలే బుగ్గిపాలవుతాయని ఈ పరత్వాడ ఉదంతం మరోసారి గుర్తుచేస్తోంది.




Tags:    

Similar News