సెలబ్రిటీ వెయిట్ లాస్ వెనక పెను ప్రమాదం?
తిండి తగ్గించి రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గుతున్నామని కెమెరా ముందు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.;
సెలబ్రిటీలు ఉన్నట్టుండి అధిక బరువు నుంచి స్లిమ్ గా మారి అందరికీ షాకిస్తున్నారు. తిండి తగ్గించి రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గుతున్నామని కెమెరా ముందు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అయితే దీనిని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఉన్నట్టుండి సోషల్ మీడియాల నుంచి మాయమయ్యే ఈ సెలబ్రిటీలు ఒజెంపిక్ అనే మందును వాడటం ద్వారా బరువు తగ్గి కనిపిస్తున్నారని కొందరు వాదిస్తున్నారు.
ఒజెంపిక్ ఆకలిని తగ్గించే మెడిసిన్. తక్కువ తిండికే కడుపు ఫుల్ గా నిండినట్టు అనిపిస్తుంది. దీనిని బరువు తగ్గించేందుకు షార్ట్ కట్ గా వాడుతున్నారనేది చాలా మంది అభియోగం. కానీ దీనిని కరణ్ జోహార్, అతడి సహచరులు ..ఇతర సెలబ్రిటీలు అస్సలు అంగీకరించరు. ఇటీవల కరణ్ జోహార్ ఉన్నట్టుండి జీరో సైజ్ లో కనిపించి పెద్ద షాకిచ్చాడు. అతడు కొన్ని నెలల పాటు బయట కనిపించలేదు. బయటకు రాగానే, బాగా చిక్కి శల్యమై అందరికీ షాకిచ్చాడు. తాను తిండి బాగా తగ్గించానని, వ్యాయామంలో తీవ్రంగా శ్రమించానని చెప్పాడు. సహజసిద్ధంగానే ఈ మార్పు సాధ్యమైందని వాదించాడు. కానీ జనం దీనిని నమ్మలేదు. అతడు ఒజెంపిక్ ఉపయోగించాడని ప్రజలు అన్నారు.
ఇది కరణ్ మాత్రమే కాదు, ఇంతకుముందు బాద్ షా, కుషా కపిల, రామ్ కపూర్ లాంటి ప్రముఖులు ఒజెంపిక్ తోనే బరువు తగ్గారని ప్రజలు వ్యాఖ్యానించారు. అయితే కోలీవుడ్ నటుడు మాధవన్ ఒక క్రమ పద్ధతి ప్రకారం.. చాలా పరిమిత ఆహారం తీసుకోవడం ద్వారా కసరత్తులతో కూడా పని లేకుండా తాను బరువు తగ్గానని చెప్పాడు. అతడు ఒజెంపిక్ ఉపయోగించేందుకు ఆస్కారం లేదని కూడా ప్రజలు నమ్మారు. ఇక్కడ ఎవరు ఎవరిని నమ్ముతారు.. నమ్మగలరు? అనేది చాలా ముఖ్యం. ఈ బాలీవుడ్ సెలబ్రిటీలను మాత్రం జనం అస్సలు నమ్మడం లేదు.
ప్రమాదాలున్నాయి తస్మాత్ జాగ్రత్త:
అయితే ఒజెంపిక్ తో ప్రమాదాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్, గుండె సమస్యలు, శ్వాస సమస్యలు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కెమెరా ముందు అందంగా కనిపించడం కంటే జీవించి ఉండటం చాలా చాలా ముఖ్యం.