జపాన్‌ ఇంటర్వల్ వాకింగ్ తో ప్రయోజనమేనా?

నడక ఆరోగ్యానికి మంచిదనే విషయం ఎప్పడూ వింటుంటాం. నిత్యం పరిమితంగా ఇన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.;

Update: 2025-09-10 11:30 GMT

నడక ఆరోగ్యానికి మంచిదనే విషయం ఎప్పడూ వింటుంటాం. నిత్యం పరిమితంగా ఇన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగా ఉండే ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణుల్లో చాలా మంది ఆ ప్రయత్నం చేయడం లేదు. బిజీ జీవితంలో తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాల పొందే మార్గాలను వెతకడం సహజం. అలాంటి వారి కోసం జపాన్‌ అభివృద్ధి చేసిన ఇంటర్వల్ వాకింగ్ పద్ధతి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నది.

10 వేల అడుగులను మించిన ఫలితం

సాధారణ నడక పరిమితంగా ఉుంటుంది. కానీ ఇంటర్వల్ వాకింగ్‌లో వేగం, తీవ్రత ప్రధాన పాత్ర పోషిస్తాయి. 3 నిమిషాలు నెమ్మదిగా, ఆ తరువాత 3 నిమిషాలు వేగంగా నడవడం ఈ ఇంటర్వల్ వాకింగ్ విధానం. ఈ విధానం, కేవలం కేలరీలనే కాకుండా, గుండె పనితీరును మెరుగుపరచడం, కండరాలకు బలం చేకూర్చడం వంటి విస్తృత ప్రయోజనాలను అందిస్తుంది. ఇది సమయాన్ని ఆదా చేయడంతో ఆరోగ్యాన్ని గరిష్టంగా కాపాడే మార్గంగా నిలుస్తున్నది.

శారీరక లాభాలు

రక్తపోటు నియంత్రణ: ఈ విధానంలో రక్తప్రసరణను సమతుల్యం చేస్తూ, హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుంది.

స్ట్రోక్ నివారణ: ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించి స్ట్రోక్‌ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

కార్డియో ఫిట్‌నెస్: వేగంగా నడిచే సమయంలో హృదయ స్పందన పెరిగి, గుండె కండరాలు బలపడతాయి.

తక్కువ ఒత్తిడి: పరుగుతో పోలిస్తే నడక ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వృద్ధులకు మరింత ప్రయోజనంగా ఉంటుంది.

మానసిక లాభాలు

నడకలో వేగం పెంచడం వల్ల ఎండార్ఫిన్స్ విడుదలై ఉత్తేజితమవుతారు. ఒత్తిడి తగ్గిపోవడంతో పాటు మైగ్రేన్, నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే దీర్ఘకాలంగా కొనసాగిస్తే క్రమబద్ధమైన నిద్ర పద్ధతులు అలవడతాయి.

సమయం ఆదా..

ఆధునిక జీవితంలో ఆరోగ్యానికి సమయం కేటాయించలేని పరిస్థితి, మానవాళిని కొత్త పరిష్కారాల కోసం వెతికేలా చేస్తోంది. ఇంటర్వల్ వాకింగ్ ఆ లోటును భర్తీ చేస్తోంది. సమయం తక్కువ ఉన్నా, ఆరోగ్యంపై దృష్టి సారించాలనుకునే వారికి వారికి ఇది సరైన మార్గం. అంతేకాక ఇది ప్రత్యేక పరికరాలు, ఖర్చు అవసరం లేని వ్యాయామం కావడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందుతున్నది.

చక్కని ప్రత్యామ్నాయం

10 వేల అడుగుల నడక సాధ్యం కాని వారికి, జపాన్‌ ఇంటర్వల్ వాకింగ్ పద్ధతి చక్కని ప్రత్యామ్నాయమనే చెప్పాలి. తక్కువ సమయం, ఎక్కువ ఫలితం ఇచ్చే ఈ విధానం, వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, జీవిత నాణ్యతను కూడా పెంచుతుంది. క్రమం తప్పకుండా ఆచరించడం ద్వారా ఇది కొత్త జీవనశైలిలో కీలక భాగంగా మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News