కడుపులో కండోమ్... డాక్టర్ చేసిన పనికి అంతా షాక్
కండోమ్ సాధారణంగా ఓ కార్యానికి వాడుతాం.. కానీ ఈ డాక్టర్ అదే కండోమ్ తో ఏకంగా ఆపరేషన్ వాడేశాడు.;
కండోమ్ సాధారణంగా ఓ కార్యానికి వాడుతాం.. కానీ ఈ డాక్టర్ అదే కండోమ్ తో ఏకంగా ఆపరేషన్ వాడేశాడు.అదే ఇప్పుడు సంచలనమైంది. చైనాలో జరిగిన ఈ అసాధారణ వైద్య ఘట్టం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒక వ్యక్తి కడుపులో కండోమ్ ఉందని కాదు… లోపల ఉన్న ఒక వస్తువును బయటకు తీయడానికి కండోమ్‌ను ఒక సురక్షిత సాధనంగా వైద్యులు ఉపయోగించిన తీరు చూసి అందరూ షాక్ అయ్యారు! వైద్య రంగంలో ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగకపోవడంతో ఈ ప్రయత్నం ఒక ప్రత్యేక రికార్డుగా నిలిచింది.
మూడు దశాబ్దాల క్రితం మింగిన లైటర్!
ఈ విస్మయకరమైన సంఘటన చైనాలోని చెంగ్డు ప్రాంతంలో చోటుచేసుకుంది. డెంగ్ అనే వ్యక్తి దాదాపు 30 సంవత్సరాల క్రితం మద్యం మత్తులో చేసిన విచిత్రమైన పని ఇందుకు కారణం. 1991 లేదా 1992లో స్నేహితుడితో కలిసి మందు తాగుతూ జరిగిన పందెంలో భాగంగా అతను ఏకంగా ఒక సిగరెట్ లైటర్‌ను మింగేశాడు! ఆశ్చర్యకరంగా ఆ సమయంలో డెంగ్‌కు ఎటువంటి తీవ్రమైన సమస్యలు రాలేదు. అప్పుడప్పుడూ కడుపు నొప్పి తప్ప అంతా సాధారణంగానే సాగింది. అయితే గత నెల నుంచి అతనికి నిరంతర కడుపు ఉబ్బరం, నొప్పి రావడంతో చివరకు ఆస్పత్రికి వెళ్ళాడు. వైద్యులు గ్యాస్ట్రోస్కోపీ చేయగా కడుపులో లోతుగా ఒక నల్లటి, గట్టి వస్తువు కనిపించడంతో ఆశ్చర్యపోయారు.
డాక్టర్లకు షాక్.. కుటుంబానికి మరీ షాక్
ఆ వస్తువు గురించి డాక్టర్లు అడగగానే డెంగ్ మత్తులో పందెం కాశానని… అప్పుడే మింగేశాను అని చెప్పడంతో వైద్యులు మొదట అసలే నమ్మలేకపోయారు. ఇక ఈ విషయం డెంగ్ భార్య, కుమారుడికి తెలిసి అవాక్కయ్యారు. 30 ఏళ్లుగా ఆ లైటర్ కడుపులోనే ఉందని వారు నమ్మలేకపోయారు.
ఫోర్సెప్స్ పనికిరాక… కండోమ్ ఎంట్రీ!
లైటర్‌ను బయటకు తీయడానికి వైద్యులు మొదట ఫోర్సెప్స్‌తో ప్రయత్నించారు. కానీ సమస్య అక్కడే వచ్చింది.లైటర్ ఉపరితలం చాలా నాజూగ్గా ఉండటం, తుప్పు పట్టి ఉండటంతో కొంచెం ఒత్తిడి చేస్తే విరిగిపోయే అవకాశం ఉందని భావించారు. లైటర్ విరిగితే పదునైన భాగాలు కడుపులో గాయాలు చేసి, పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. అప్పుడే వైద్యులు ఒక అసాధారణమైన, కాని అత్యంత సురక్షితమైన పద్ధతిని ఆలోచించారు. కండోమ్‌ను ఫోర్సెప్స్ చివర చుట్టి జాగ్రత్తగా కడుపులోకి పంపారు. లైటర్‌ను ఆ కండోమ్‌లో నొక్కి, సురక్షితంగా చుట్టారు. నెమ్మదిగా పైకి లాగి నోటి ద్వారా విజయవంతంగా బయటకు తీశారు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లో పూర్తయింది. బయటకు తీసిన లైటర్ పొడవు దాదాపు 7 సెం.మీ ఉందని అది పూర్తిగా తుప్పు పట్టి, విచ్ఛిన్నం కావడానికి దగ్గరగా ఉందని వైద్యులు వెల్లడించారు.
వైద్య చరిత్రలోనే ఇదొక ప్రత్యేక రికార్డు
డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం.. ఇంతకాలం 30 ఏళ్లు పాటు ఒక వస్తువు కడుపులో ఉండటం... అదీ ఎలాంటి తీవ్రమైన సమస్యలు లేకుండా ఉండటం.. కండోమ్ సహాయంతో సురక్షితంగా దానిని విజయవంతంగా బయటకు తీయడం... ఈ అంశాలన్నీ కలిపి ఈ కేసును వైద్యరంగంలో ఒక అరుదైన, ప్రత్యేక ఘట్టంగా నిలిపాయి.
ప్రస్తుతం డెంగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరలోనే కోలుకుంటారని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఒక పందెం కారణంగా ఏర్పడిన 30 ఏళ్ల సమస్యకు ఒక సృజనాత్మకమైన పరిష్కారం దొరకడం వైద్యుల నైపుణ్యానికి నిదర్శనం.