గాయకుడి అంతిమయాత్రలో ఊక వేస్తే రాలనంతగా..
ఇప్పుడు ప్రముఖ అస్సామీ గాయకుడు జూబీన్ ని విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో అతడి కోసం నగర వీధులు కిటకిటలాడిన దృశ్యాలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.;
ఒక నటుడు లేదా సెలబ్రిటీ ప్రజల హృదయాల్లో ఏ స్థాయిలో స్థానం సంపాదించుకున్నాడో ఊహకు అందనిది. సినీ సెలబ్రిటీలకు ప్రజల్లో ఉండే ఫాలోయింగ్ అసాధారణమైనది. ఇప్పుడు ప్రముఖ అస్సామీ గాయకుడు జూబీన్ ని విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో అతడి కోసం నగర వీధులు కిటకిటలాడిన దృశ్యాలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సంగీత దిగ్గజానికి వేలాది మంది వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్న వీడియోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తమ ఫేవరెట్ గాయకుడు జుబీన్ గార్గ్ మృతికి సంతాపం తెలిపింది. ఆయన భౌతికకాయం ఆదివారం నాడు సింగపూర్ నుంచి గౌహతికి చేరుకుంది. సింగపూర్‌లో ఈత కొడుతూ 52 ఏళ్ల జుబీన్ ప్రమాదవశాత్తూ మరణించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో, అభిమానుల హృదయాలు విషాదంతో నిండిపోయాయి.
అతడి పార్థీవ దేహాన్ని ఇంటికి తరలించేప్పుడు.. తమ ఫేవరెట్ కళాకారుడికి నివాళులు అర్పిస్తూ 10 వేల మందిపైగా అభిమానులు వీధుల్లో బారులు తీరారు. వాహనాలపై అంతిమయాత్ర ఆద్యంతం ర్యాలీ చేసారు. మేటి గాయకుడు గార్గ్‌ను గౌరవించేందుకు గౌహతిలో వ్యాపారులు దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా అంతిమయాత్రలో పాల్గొన్నారు.
జుబిన్ భౌతికకాయాన్ని ఢిల్లీకి తరలించి ఉదయం 7 గంటల ప్రాంతంలో గౌహతి నుంచి ఒక ప్రయివేట్ విమానంలో అస్సాం- గౌహతికి తరలించారు. విమానాశ్రయంలో గార్గ్ భార్య గరిమా సైకియా సాంప్రదాయ అస్సామీ గామోసా విధానంలో పువ్వులను పేటికపై ఉంచిన సమయంలో విలపించారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా, రాష్ట్ర సీనియర్ అధికారులు కూడా జుబిన్ అంతిమ యాత్రకు ముందు యాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్ర ఆద్యంతం అభిమానులు జుబిన్ పాడిన పాటలు పాడుతూ కనిపించారు.
మూడు దశాబ్దాల కెరీర్‌లో 40 భాషలలో విభిన్న మాండలికాలలో 38,000 పైగా పాటలను పాడిన మేటి గాయకుడు జుబిన్. అతడి దహన సంస్కారాల కోసం అస్సాం ప్రభుత్వం గౌహతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఏర్పాట్లు చేయనుందని సమాచారం. అతడు ప్రజా జీవితంలో ఎంతగా అల్లుకుపోయాడో చెప్పడానికి మాటలు చాలవు. అతడి పాటలు అక్కడ సంస్కృతిలో ఒక భాగం. అందుకే ఇంతటి భారీ ఫాలోయింగ్ ని అతడు సాధించాడు.