పాన్ ఇండియా చిత్రం వాయిదా వేస్తున్నారా?
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో `టాక్సిక్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో `టాక్సిక్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. చిత్రీకరణ అంతా బెంగుళూరు, ముంబై ప్రాంతాలకే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. ఆ రెండు ప్రదేశాల్లో కీలక షెడ్యూల్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే ముంబైలో 45 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బెంగుళూరులో మరో కొత్త షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో టాకీ పూర్తవుతందని సమాచారం. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో టీమ్ రిలాక్స్ అవుతోంది.
రిలీజ్ కి సరైన సమయం కాదా:
బెంగుళూరు షెడ్యూల్ నెమ్మదిగా నిర్వహిస్తున్నారు. ఎలా లేదన్నా అక్టోబర్ కి చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. ఆ ధీమాతోనే సినిమాని మార్చి 19న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతోంది. మార్చి నుంచి ఏడాది మిడ్ లో రిలీజ్ చేసేలా కొత్త ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. అందుకు గల కారణాలు ఏంటి? అన్నది తెలియదు గానీ రిలీజ్ మాత్రం వాయిదా పక్కా అంటున్నారు. మార్చి సీజన్ అంటే థియేట్రికల్ రిలీజ్ కు సరైన సమయంగా మేకర్స్ భావించడం లేదు.
నాలుగేళ్ల తర్వాత రిలీజ్:
పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అన్ని రాష్ట్రాల పరిస్థితులకు దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేయాల్సిన చిత్రంగా భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ సమయంలో పరీక్షలు జరగనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు అప్పుడే జరుగుతాయి. విద్యార్దులు ఎవరూ థియేటర్ వైపు చూసే పరిస్థితి ఉండదు. థియేటర్ ఆక్యుపెన్సీ బాగుండాలంటే సెలవులు సీజన్ అయితేనే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్-మేలో రిలీజ్ అయ్యే అకాశాలు కనిపిస్తున్నాయి. యశ్ నుంచి నాలుగేళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రమిది.
ఎలివేషన్ వీక్ గా:
`కేజీఎఫ్` తర్వాత ఎంతో సెలక్టివ్ గా ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్ ఇది. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ టాక్సిక్ ప్రచార చిత్రాలు మాత్రం అంచనాలను డౌన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన గ్లింప్స్ సహా ఇతర ప్రచార చిత్రాలేవి ఆకట్టుకోలేదు. దీంతో సినిమాకు పెద్దగా హైప్ రావడం లేదు. కేజీఎఫ్ రేంజ్ హీరో మళ్లీ రొటీన్ కంటెంట్ తో వస్తున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.