'దురంధర్' స్టార్ రణ్‌వీర్ ఆర్జన ఎంత? 'టాక్సిక్'లో యష్ వాటా ఎంత?
ఈరోజుల్లో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే సరిహద్దులేవీ లేవు. ఇప్పుడు అందరూ కలిసి భారతీయ సినీపరిశ్రమ.
ఈరోజుల్లో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే సరిహద్దులేవీ లేవు. ఇప్పుడు అందరూ కలిసి భారతీయ సినీపరిశ్రమ. అందుకే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రాజెక్ట్ పార్ట్‌నర్‌షిప్స్, లాభాల పంపకాల బిజినెస్ మోడల్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన `దురంధర్` .. రిలీజ్ కి రెడీ అవుతున్న భారీ చిత్రం `టాక్సిక్` బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. గతంలో కేవలం ఒకే రకమైన పారితోషికం తీసుకునే స్టార్ హీరోలు, దర్శకులు ఇప్పుడు నేరుగా లాభాల్లో వాటాలు అందుకుంటూ సినిమాల్లో భాగస్వాములుగా మారుతున్నారు. ఇది చిత్ర నిర్మాణ రంగంలో సరికొత్త విప్లవానికి దారితీస్తోంది.
ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన `దురంధర్` ఫ్రాంచైజీ ఏకంగా 3000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు ముందస్తు ఒప్పందాల ప్రకారం రణ్ వీర్ సింగ్ కి 25శాతం వాటా దక్కాల్సి ఉంది.. దానిని నిర్మాణ సంస్థ చెల్లించిందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్‌కు కూడా 25 శాతం వాటా దక్కింది. ఈ వాటాల ప్రాతిపదికన రణ్‌వీర్ సింగ్‌కు రూ.325 కోట్లు, ఆదిత్య ధర్(B62 స్టూడియోస్)కు రూ.325 కోట్లు లభించాయి. వీరిద్దరికీ కలిపి మొత్తం రూ.650 కోట్లు అందగా, ఈ చిత్ర ప్రధాన నిర్మాణ సంస్థ అయిన జియో స్టూడియోస్ 50 శాతం వాటాతో ఏకంగా రూ.1300 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
`దురంధర్` స్టార్ రణ్‌వీర్ సింగ్ సాధించిన ఈ భారీ ఆర్జన స్పూర్తితో... ఇప్పుడు కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న `టాక్సిక్` సినిమా కూడా అదే తరహా లాభాల వాటా బిజినెస్ మోడల్‌ను అనుసరిస్తోంది. విభిన్న నిర్మాణ సంస్థల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాకు యశ్ కేవలం హీరో మాత్రమే కాదు. ఆయన తన సొంత నిర్మాణ సంస్థ అయిన `మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్` ద్వారా ఈ చిత్రానికి సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఈ సినిమా సాధించే లాభాల్లో ఆయనకు భారీ మొత్తంలో వాటా దక్కేలా ఒప్పందాలు జరిగాయి.
ఈ సినిమాకు సంబంధించిన అంచనా వాటాల వివరాలను పరిశీలిస్తే... భిన్నమైన వ్యక్తులు .. సంస్థల మధ్య ఒప్పందాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రధాన పెట్టుబడిదారుగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యయాన్ని భరిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యధికంగా 40 శాతం నుండి 50 శాతం వరకు వాటాను కలిగి ఉంది. ఇక హీరో యశ్ తన సొంత బ్యానర్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా హీరోగా నటిస్తూ.. తన క్రేజ్ -మార్కెటింగ్‌కు బ్రాండ్ వాల్యూ జోడిస్తున్నందుకు గానూ 30 శాతం నుండి 40 శాతం వరకు వాటాను సొంతం చేసుకోనున్నారు.
మరోవైపు... ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌కు కూడా `దురంధర్` చిత్రంలో ఆదిత్య ధర్ లాగే లాభాల్లో వాటా ఉండేలా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఆమెకు 10 శాతం నుండి 15 శాతం వరకు వాటా లభించనుంది. ఒకవేళ `టాక్సిక్` సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంటే... ఈ ఒప్పందాల ప్రకారం భాగస్వాములందరూ ఊహించని విధంగా వందల కోట్ల భారీ లాభాలను కళ్లజూసే అవకాశం ఉంది. ముఖ్యంగా హీరో యశ్ - దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కెరీర్‌లోనే ఇది అత్యధిక ఆర్జనగా నిలవనుందని అంచనా. మరోవైపు నితీష్ తివారీ `రామాయణం`లో కూడా రాకింగ్ స్టార్ యష్ పెట్టుబడులు పెట్టి భాగస్వామిగా చేరారు గనుక లాభాల్లో భారీ వాటా అందుతుందని అంచనా వేస్తున్నారు.