విలన్ కాదు.. విజన్ ఉన్న రాజు! రావణుడి పాత్రపై ట్విస్ట్
ముఖ్యంగా డైరెక్టర్ నితేష్ తివారీ చెప్తున్న వివరాలు చూస్తే, ఈ సినిమా మామూలు మైథాలజికల్ అడాప్టేషన్ కాదని స్పష్టమవుతోంది.;
రీసెంట్ గా రిలీజైన రామాయణ పార్ట్1 టీజర్‌పై మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, చిత్ర బృందం మాత్రం తమ ప్రాజెక్ట్‌పై పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా డైరెక్టర్ నితేష్ తివారీ చెప్తున్న వివరాలు చూస్తే, ఈ సినిమా మామూలు మైథాలజికల్ అడాప్టేషన్ కాదని స్పష్టమవుతోంది. రామాయణలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది యష్ పోషిస్తున్న రావణుడి పాత్ర.
మల్టీ డైమన్షనల్ వ్యక్తిత్వంగా ఆవిష్కరణ..
సాధారణంగా రావణుడిని విలన్ పాత్రలో మాత్రమే చూపించే ధోరణికి భిన్నంగా, ఈసారి ఆ పాత్రను మల్టీ డైమెన్షనల్ వ్యక్తిత్వంగా ఆవిష్కరించబోతున్నట్టు నితేశ్ తివారి వెల్లడించారు. వీరత్వం, శివభక్తి, సంగీత పరిజ్ఞానం, రాజధర్మం లాంటి అనేక గొప్ప లక్షణాలతో కూడిన రాజుగా రావణుడిని చూపించబోతున్నారట. అవన్నీ ఉన్నప్పటికీ స్వార్థం, పరస్త్రీ వ్యామోహం లాంటి మానవ లోపాలు అతని పతనానికి ఎలా కారణమయ్యాయన్న విషయాన్ని కూడా కథలో భాగంగా చూపించనున్నారని, ఈ విధంగా రావణుడిని విలన్ గా కాకుండా విజన్ ఉన్న రాజు గా చూపించబోతుండటం సినిమాకే మెయిన్ హైలైట్ గా మారింది.
ఎన్టీఆర్, ఎస్వీ రంగారావుతో పోలికలు
ఇక ఈ పాత్రకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం, గతంలో వచ్చిన క్లాసిక్ సినిమాలతో పోలికలు రావడం. పలు సినిమాల్లో ఎన్టీఆర్ రావణుడిగా చూపించిన వైవిధ్యం, అలానే ఎస్‌వీ రంగారావు చూపిన గంభీరమైన యాక్టింగ్ ఇప్పటికీ ఆడియన్స్ మదిలో చెరగని ముద్రను వేశాయి. అలాంటి లెజెండరీ నటులతో పోల్చినప్పుడు, యష్ ఎలా నిలబడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పోలికలు సహజంగానే సినిమాపై, ఆ పాత్రపై భారీ అంచనాలను తీసుకురావడం ఖాయం.
రాకీ భాయ్ నుంచి రావణుడి వరకు..
యష్ కెరీర్ దృష్ట్యా కూడా ఈ సినిమా ఒక కీలక మలుపుగా భావించవచ్చు. కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన, తరువాత టాక్సిక్ లాంటి ప్రాజెక్ట్‌ను సెలెక్ట్ చేసుకుని తన ఇమేజ్‌ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రావణుడి వంటి సంక్లిష్టమైన, ఛాలెంజింగ్ పాత్రను అంగీకరించడం నటుడిగా అతనికున్న ధైర్యాన్ని సూచిస్తోంది. రాకీ భాయ్ నుంచి రావణుడి వరకూ అనే మార్పు, అతని కెరీర్‌లో ఒక పెద్ద రిస్క్ అయినప్పటికీ, అదే సమయంలో గొప్ప అవకాశంగా కూడా నిలవొచ్చు.
ఇక కథలోని మెసేజ్ కూడా ఈ సినిమాకు మరో బలం కావచ్చు. రావణుడి జీవితాన్ని కేవలం యుద్ధం, అపహరణ కోణంలో కాకుండా, మానవ విలువలు మరియు లోపాల దృక్కోణంలో చూపించడం ద్వారా ప్రేక్షకులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని దర్శకుడు భావిస్తున్నారు. అధిక అహంకారం, స్వార్థం, నియంత్రణ లేని కోరికలు ఎంతటి మహానుభావుడినైనా ఎలా కూలదోసేస్తాయన్నది ఈ కథలో ప్రధానాంశంగా నిలవనుందని నితేష్ వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతుంది. మొత్తమ్మీద, యష్ ఈ పాత్రలో తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగితే, అది కేవలం ఒక మంచి పెర్ఫార్మెన్స్‌గా మాత్రమే కాకుండా అవార్డు స్థాయి నటనగా కూడా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రధానంగా ఆధారపడేది నితేశ్ తివారి చేసిన క్యారెక్టర్ డిజైన్, స్క్రీన్‌ప్లే.. అన్ని అంశాలూ అనుకున్నట్టు కుదిరితే, ఈ రామాయణం మరోసారి భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశాలు లేకపోలేదు.