ఆయ‌న క‌న్న క‌ల‌లు ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ‌తాయి: `రామాయ‌ణ` ప్రీరిలీజ్‌లో య‌ష్‌

ర‌ణ‌బీర్ క‌పూర్ రామాయ‌ణం విడుద‌ల‌కు కొద్ది రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికే ప్రీబుకింగులు కూడా ఓపెన‌య్యాయి.

Update: 2026-10-19 17:29 GMT

ర‌ణ‌బీర్ క‌పూర్ రామాయ‌ణం విడుద‌ల‌కు కొద్ది రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికే ప్రీబుకింగులు కూడా ఓపెన‌య్యాయి. నేటి సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగిన రామాయణం ప్రీరిలీజ్ వేడుకలో రాకింగ్ స్టార్ యశ్ చేసిన ప్రసంగం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు తమపై చూపిస్తున్న ప్రేమకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, సినిమా అనేది ఒక సుదీర్ఘ ప్రయాణమని.. ప్రేక్షకులకు వినోదం అందించ‌డ‌మే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పాన్-ఇండియా సినిమాలకు మార్గం సుగమం చేసిన తెలుగు చలనచిత్ర పరిశ్రమను, ముఖ్యంగా రాజమౌళి, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారి అద్భుతమైన కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. అలాగే నిర్మాత దిల్ రాజుతో ఇది తన మూడో ప్ర‌య‌త్న‌మని చెబుతూ.. పంపిణీ విషయంలో ఆయన చూపించే శ్రద్ధను, అంకితభావాన్ని యశ్ ప్రశంసించారు.

ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారీ పనితీరును యశ్ ప్రత్యేకంగా అభినందించారు. కొందరి దర్శకుల పనిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం.. కానీ నితీష్ తివారీ గారు సెట్స్‌ను హ్యాండిల్ చేసే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని ఆయన కొనియాడారు. ప్రతి సినిమా ఆ దర్శకుడి హృదయాన్ని ఆవిష్కరిస్తుందని, నితీష్ ఈ సినిమాను ఎంత సింపుల్‌గా.. ఎంత అద్భుతంగా తెరకెక్కించారో ప్రశంసించారు. శ్రీరాముడి పాత్రలోని సింప్లిసిటీ- దైవత్వాన్ని అలాగే రావణుడి పాత్రలోని ఇంటెన్సిటీని ఆయన ఎంతో సమతుల్యంగా డిజైన్ చేశారని... సెట్‌లో అందరితో కలిసి పనిచేసే గొప్ప టీమ్ ప్లేయర్ అని యశ్ తెలిపారు.

ఇక చిత్రంలోని తోటి నటీనటుల గురించి యశ్ మాట్లాడుతూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. సాయిపల్లవిని ప్రశంసిస్తూ ఆమెలో సహజమైన దైవిక గుణాలు, సీతామాత వైబ్స్ స్పష్టంగా కనిపిస్తాయని.. ఆ పాత్రకు ఆమె పూర్తిన్యాయం చేశారని తెలిపారు. రణ్‌బీర్ కపూర్‌ను కొనియాడుతూ అత‌డిలో అసలు ఈగో లేదని.. ఎంతో అమాయకమైన, ఉత్సాహభరితమైన నటుడని చెప్పారు. అలాగే మన తెలుగు అమ్మాయిలాంటి రకుల్ ప్రీత్ సింగ్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని... రవి దూబే ఎంతో పరిణతి గల నటుడిగా తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తారని వెల్లడించారు.

ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న నిర్మాత నమిత్ మల్హోత్రా కన్న కలలు, ఆయన చూపిన ప్యాషన్ ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలకంగా మారాయ‌ని యశ్ స్పష్టం చేశారు. లాస్ ఏంజెలెస్ (LA) లో నమిత్ మల్హోత్రాను కలిసినప్పుడు ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయిలో అత్యున్నత స్థానంలో నిలపడమే తన లక్ష్యమని ఆయన చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఆ గొప్ప దృక్పథాన్ని బలపరుస్తూ... తాను ఈ చిత్రంలో రావణుడిగా నటించడంతో పాటు ప్రొడ్యూసింగ్ పార్టనర్‌గా కూడా భాగమయ్యానని తెలిపారు. ఈ సినిమా కోసం నమిత్ తన పేరు ప్రతిష్టలను, ఆస్తులను పణంగా పెట్టారని.. చిన్న చిన్న వీఎఫ్ఎక్స్ లోపాలను వెతకకుండా సినిమాను పెద్ద మనసుతో ఆదరించాలని ఆయన ప్రేక్షకులను కోరారు.

అంతిమంగా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ పరిశ్రమలన్నీ ఇకనైనా ఒకే తాటిపైకి రావాలని యశ్ పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా అడుగులు వేసి.. మన భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మహాకావ్యం కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా.. దేశం గర్వించదగ్గ అద్భుత దృశ్యకావ్యంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వేదికపై యశ్ చెప్పిన ఈ స్ఫూర్తిదాయకమైన మాటలు, సినిమాపై ఆయనకున్న అంకితభావం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.



Full View


Tags:    

Similar News