లెజెండరీ సింగర్ బయోపిక్.. ఆస్కార్ గ్రహీత- ఫిలింఫేర్ గ్రహీత కలిసి వస్తున్నారు!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది శ్రోతలను అలరించిన లెజెండరీ గాయని పి. సుశీల జీవిత చరిత్ర (బయోపిక్) తెరకెక్కనుందని ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది శ్రోతలను అలరించిన లెజెండరీ గాయని పి. సుశీల జీవిత చరిత్ర (బయోపిక్) తెరకెక్కనుందని ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఒక దిగ్గజ గాయని జీవిత కథ కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత, ఫిలింఫేర్ సహా పలు పురస్కారాలను అందుకున్న ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లు కలిసి వస్తుండటం ప్రస్తుతం గొప్ప ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ అరుదైన ప్రాజెక్ట్ కోసం ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించనుండగా.. టాలెంటెడ్ నటి రుక్మిణి వసంత్ ఈ బయోపిక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో 2021లో తన `99 సాంగ్స్` సినిమా గురించి చర్చిస్తున్న సమయంలో పి. సుశీల తన జీవిత కథను కూడా ఇదే రీతిలో తెరకెక్కించాలని కోరుకున్నట్లు రెహమాన్ స్వయంగా వెల్లడించారు. తన కథను సినిమాగా మలచడంలో సహాయం చేయాలని దిగ్గజ గాయని తనను కోరినట్లు ఆయన తెలిపారు.
1960ల నుంచి ఇప్పటివరకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర ఆరు భారతీయ భాషలలో సుమారు 17,695లకు పైగా సోలో, డ్యూయట్ , కోరస్ పాటలను రికార్డు చేసి పి. సుశీల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అలాగే ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. తెలుగులో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తొలి డ్యూయట్ ఆమెతోనే పాడటం విశేషం. అలాగే తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వేలాది గీతాలను ఆలపించి, ఎస్.పి.బి, ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ వంటి దిగ్గజ గాయకులతో కలిసి ఎవర్ గ్రీన్ పాటలను అందించారు.
గాయనిగా సుశీల అందుకున్న పురస్కారాలు అసాధారణమైనవి. 1969లో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని (ఉత్తమ నేపథ్య గాయని) అందుకున్న ఘనత ఆమె సొంతం. తెలుగులో మూడుసార్లు, తమిళంలో రెండుసార్లు జాతీయ అవార్డులను దక్కించుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పౌర పురస్కారమైన `పద్మ భూషణ్` (2008)తో పాటు, తమిళనాడు ప్రభుత్వం నుంచి `కళైమామణి`, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి `ఘంటసాల`, `రఘుపతి వెంకయ్య` అవార్డులు, కర్ణాటక ప్రభుత్వం నుండి `గాన సరస్వతి` పురస్కారాలను ఆమె అందుకున్నారు. అలాగే అరడజనుకు పైగా నంది పురస్కారాలు, ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
ఇలా అసాధారణమైన రికార్డులు.. మరువలేని మధుర గీతాలు... ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలతో సాగిన పి. సుశీల జీవిత ప్రయాణాన్ని వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీత సారధ్యం, రుక్మిణి వసంత్ నటన కలయిక గురించి అధికారికంగా స్పష్ఠత వచ్చేస్తే అది నిజంగా గొప్ప ట్రీట్ గా మారుతుందనడంలో సందేహం లేదు. లెజెండరీ గాయని బయోపిక్కు సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.