'బేబీ' తర్వాత మహేష్‌ బాబు కాంపౌండ్‌లో అడుగు..!

2023లో వచ్చిన బేబీ సినిమా కల్ట్‌ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. ఒక చిన్న సినిమాగా రూపొంది పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న బేబీ సినిమాతో దర్శకుడిగా సాయి రాజేష్‌ మంచి పేరును తెచ్చుకున్నాడు.

Update: 2026-10-19 15:30 GMT

2023లో వచ్చిన బేబీ సినిమా కల్ట్‌ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. ఒక చిన్న సినిమాగా రూపొంది పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న బేబీ సినిమాతో దర్శకుడిగా సాయి రాజేష్‌ మంచి పేరును తెచ్చుకున్నాడు. బేబీని హిందీలో చేయాలని బలంగా ప్రయత్నాలు జరిగాయి. ఒక హీరోను అనుకుని మొత్తం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేసుకుంటే తీరా ఆ హీరో తప్పుకున్నాడు. మరో హీరో కోసం వెతుకుతున్నట్లు హిందీ మీడియాలో కథనాలు వచ్చాయి. అంతే కాకుండా బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య చేసిన పాత్రకు గాను ఒక స్టార్ హీరోయిన్‌ కూతురును అడిగారని వార్తలు వచ్చాయి. ఆమె సైతం ఆసక్తిగా ఉన్నట్లు చెప్పింది. కానీ ఆమె ఎంపిక సైతం జరగలేదు. మొత్తానికి బేబీ సినిమా హిందీ రీమేక్ దాదాపుగా క్యాన్సల్‌ అయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హిందీలో బేబీ సినిమా లేకపోవడంతో తెలుగులోనే సాయి రాజేష్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నడట.

మహేష్ బాబు కోసం కాకుండా...

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బేబీ సినిమా ఇచ్చిన హిట్‌తో ఒక లవ్‌ స్టోరీ పట్టుకుని మహేష్ బాబు కాంపౌండ్‌లో సాయి రాజేష్ అడుగు పెట్టాడని తెలుస్తోంది. సాయి రాజేష్‌ కథ చెప్పడం, ఆ ఫ్యామిలీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం జరిగిందట. అయితే సాయి రాజేష్ రెడీ చేసుకున్న లవ్‌ స్టోరీ మహేష్‌ బాబు లేదా సుధీర్ బాబుకు కాదు. యంగ్‌ హీరో ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చిన జయకృష్ణ కోసం అని తెలుస్తోంది. విభిన్నమైన సినిమాలను తీస్తాడని, నిర్మిస్తాడనే పేరు ఉన్న సాయి రాజేష్‌ కి సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంది. అందుకే మహేష్‌ బాబు కాంపౌండ్‌లోకి సాయి రాజేష్‌ కి అడుగు పెట్టే ఛాన్స్ దక్కినట్లు అనుకుంటున్నారు. జయకృష్ణను డైరెక్ట్‌ చేసే బాధ్యత దాదాపుగా సాయి రాజేష్‌ దక్కించుకున్నట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అతి త్వరలోనే మంచి రోజు చూసి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

జయకృష్ణ హీరోగా శ్రీనివాస మంగాపురం

శ్రీనివాసా మంగాపురం సినిమాతో జయకృష్ణ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు, చూడ్డానికి క్యూట్‌గా మహేష్‌ బాబు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాడో అలా ఉన్నాడు అంటూ రివ్యూలు వచ్చాయి. సినిమా కమర్షియల్‌ హిట్‌ కాకపోయినా, జయకృష్ణ లుక్స్‌, యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. వారసత్వం ఎటు పోతుంది, తాత, బాబాయి, తండ్రి వారసత్వంతో జయకృష్ణ యాక్టింగ్‌ ప్రతిభను కనబర్చుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లోనూ టాక్‌ వినిపించింది. జయకృష్ణ మొదటి సినిమాను ఒక ప్యూర్‌ లవ్‌ స్టోరీతో చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు కూడా జయకృష్ణ లవ్‌ స్టోరీతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రొమాంటిక్ లవ్‌ డ్రామాగా ఒక స్క్రీప్ట్‌ను సాయి రాజేష్ రెడీ చేశాడని, మహేష్‌ బాబు కాంపౌండ్‌లో కొందరు ఇప్పటికే కథ విని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. వారణాసితో బిజీగా ఉండటం వల్ల మహేష్‌ బాబు కథను వినలేదని తెలుస్తోంది. త్వరలోనే ఆయన కథ వింటాడనే వార్తలు వస్తున్నాయి.

జయకృష్ణ రెండో సినిమాకు సాయి రాజేష్‌ దర్శకుడు..

సాయి రాజేష్‌ ఇప్పటి వరకు దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు మూడు సినిమాలను తీసుకు వచ్చాడు. అయితే మొదటి రెండు పూర్తిగా కామెడీ సినిమాలు కాగా, బేబీ సినిమాతో ఒక సీరియస్‌ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఏడాది చెన్నై లవ్‌ స్టోరీ సినిమాను నిర్మాతగా సాయి రాజేష్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. నిర్మాతగా, దర్శకుడిగా మంచి పేరును తెచ్చుకుంటున్న సాయి రాజేష్‌కి సరైన సమయంలో పెద్ద ఫ్యామిలీ హీరో ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్ దక్కింది. ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటే మరింత పెద్ద అవకాశాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. మహేష్ బాబు వంటి సూపర్‌ స్టార్‌ మెచ్చే విధంగా సినిమా తీస్తే తప్పకుండా ఆయన కూడా పిలిచి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే జయకృష్ణ రీ లాంచ్‌ బాధ్యతను తన భుజాల వేసుకుని సాయి రాజేష్‌ ఏం చేయబోతున్నాడు అనేది చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News