భారతీయ సినిమా పవరేంటో చూస్తారు.. `రామాయణం` ప్రీరిలీజ్‌లో దిల్ రాజు వ్యాఖ్యలు
నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం `రామాయణం- పార్ట్ 1` నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం `రామాయణం- పార్ట్ 1` నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సంస్థ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీరిలీజ్ వేడుకలో దిల్ రాజు మాట్లాడిన మాటలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా తనకు సినిమాకు సంబంధించిన కొన్ని 3D విజువల్స్‌ను చూపించారని.. అవి `మైండ్ బ్లోయింగ్` అని దిల్ రాజు ప్రశంసించారు. సాధారణంగా వీఎఫ్ఎక్స్ అనగానే మనకు హాలీవుడ్ సినిమాలే గుర్తుకు వస్తాయని, తెలుగులో రాజమౌళి మన సినిమాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లగా.. ఇప్పుడు నితీష్ తివారీ తెరకెక్కించిన ఈ `రామాయణం`తో మరోసారి ఆ స్థాయి అద్భుతమైన విజువల్స్ థియేటర్లలో చూడబోతున్నామని దిల్ రాజు వ్యాఖ్యానించారు.
`దంగల్` వంటి ప్రపంచస్థాయి సినిమాతో ఇండియన్ సినిమా సత్తా చాటిన నితీష్ తివారీ దర్శకత్వం, ఏ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని దిల్ రాజు తెలిపారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, శూర్పణఖగా మన తెలుగుమ్మాయి రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారని పేర్కొన్నారు. రామాయణం అనేది ప్రతి భారతీయుడి సంస్కృతిలో, రక్తంలో జీవించి ఉన్న గొప్ప ఇతిహాసమని.. అలాంటి మహాఘట్టాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్న చిత్ర యూనిట్‌ను ఆయన అభినందించారు.
ఇదే వేదికపై విలన్ పాత్ర ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. ``ప్రతి సినిమాకి, ప్రతి కథకి హీరో కంటే విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి. రామాయణంలో గాని, మహాభారతంలో గాని విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంది గనుకనే హీరో పాత్ర అంత శక్తివంతంగా కనిపించింది`` అని దిల్ రాజు అన్నారు. అలాంటి రావణుడి పవర్ఫుల్ పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారని.. ఆయన ఏ క్యారెక్టర్ తీసుకున్నా దానికోసం ప్రాణం పెట్టి కష్టపడతారని కొనియాడారు. కేజీఎఫ్‌తో చరిత్ర సృష్టించిన యష్ ఈ చిత్రంలో మరింత అద్భుతంగా కనిపించబోతున్నారని తెలిపారు.
ఈ వేదికపై హిందీ బెల్ట్ పంపిణీదారు, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌తో దిల్ రాజు జరిపిన సంభాషణలు.. వారి మధ్య ఉన్న పరస్పర గౌరవం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ విజువల్ వండర్ నవంబర్ 5న వస్తోందని, తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయని దిల్ రాజు వెల్లడించారు. భారతీయ సినీపరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటే ఈ అద్భుత కళాఖండాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలోనే అనుభవించాలని, ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.