కియారాకు బాడీ గార్డ్ గా యష్!
ముంబైలో జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న యష్ షూటింగ్ సెట్స్‌లో కియారా పట్ల తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో వివరించారు.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్` చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తి స్తున్నాయి. ఈ సినిమాలో నటిస్తోన్న కియారా అద్వానీ ప్రదర్శించిన వృత్తి నైపుణ్యం .. ఆమె పట్ల చిత్రబృందం చూపిన జాగ్రత్తల గురించి హీరో యష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. గర్భవతిగా ఉన్నప్పటికీ కియారా చూపిన అంకితభావం పట్ల యష్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
ముంబైలో జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న యష్ షూటింగ్ సెట్స్‌లో కియారా పట్ల తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో వివరించారు. సినిమా షూటింగ్ అత్యంత శ్రమతో కూడుకున్నదని.. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కియారా వంద శాతం నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. కియారా ఆరోగ్యం పట్ల తాను దర్శకురాలు గీతూ మోహన్దాస్ ఎంతో ఆందోళన చెందామని సెట్‌లో ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తామే స్వయంగా బాడీగార్డ్స్ గా వ్యవహరించామని యష్ వెల్లడించారు.
వాస్తవానికి షూటింగ్ సమయంలో కియారా ఎదుర్కొన్న శారీరక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం ఆమెకు ప్రాధాన్యతనిచ్చింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా వర్షంలో చేసే యాక్షన్ ఎపిసోడ్లు చాలా కష్టతరమైనవి. అలాంటి సమయంలో కూడా కియారా వెనకడుగు వేయకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించడం వృత్తి పట్ల ఉన్న ఆమెకున్న గౌరవాన్ని తెలియజేస్తుందని యష్ పేర్కొన్నారు. కియారా అద్వానీ కెరీర్‌లో ఈ చిత్రం ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇటీవల విడుదలైన ఓ పాటలోని సన్నివేశాల పట్ల సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటన్నింటినీ దాటి సినిమా ట్రైలర్ విడుదలయ్యాక ప్రేక్షకులలో మంచి ఆదరణ లభించింది. యష్ సైతం ఈ విషయంలో కియారాకు మద్దతుగా నిలిచారు. తాము కొత్త తరహా కథాంశంతో వస్తున్నామని ప్రేక్షకులు తప్పకుండా దీనిని అభినందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవాలని యశ్ కియారాను ప్రోత్సహించారు.
`కెజిఎఫ్ 2` వంటి భారీ విజయం తర్వాత యష్ నుండి వస్తున్న సినిమా కావడంతో `టాక్సిక్ ` పై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న చిత్రంలో హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా , నయనతార వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తండ్రీకొడుకుల మధ్య ఉండే సంక్లిష్టమైన సంబంధం నేపథ్యంలో కథాంశం సాగుతుందని ట్రైలర్ లో కనిపిస్తుంది. కన్నడ -ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం ,మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.