ఆదివారం సెల‌వు ఇవ్వ‌లేద‌ని ఛాన్సే వ‌దిలేసిన న‌టుడు!

1976లో ప్రముఖ దర్శకుడు ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో రిలీజ్ అయిన `హేరా ఫేరి` చిత్రంలో మొదట అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించాల్సిందిగా ఫిరోజ్ ఖాన్‌ను సంప్రదించారు.

Update: 2026-09-30 13:30 GMT

బాలీవుడ్ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోగా వెలుగొందిన దివంగత నటుడు, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ వ్యక్తిగత నిబంధనలకు ఎంతో కట్టుబడి ఉండేవారనే విషయం తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన క్లాసిక్ హిట్ `హేరా ఫేరి` చిత్రంలో నటించే అవకాశాన్ని ఫిరోజ్ ఖాన్ ఒక్కే ఒక్క కారణంతో చేజార్చుకున్నారు. ఈ విష‌యాన్ని దర్శకుడు సంజయ్ గుప్తా సోషల్ మీడియా వేదిక‌గా రివీల్ చేయ‌డంతోనే వెలుగులోకి వ‌చ్చింది.

1976లో ప్రముఖ దర్శకుడు ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో రిలీజ్ అయిన `హేరా ఫేరి` చిత్రంలో మొదట అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించాల్సిందిగా ఫిరోజ్ ఖాన్‌ను సంప్రదించారు. అయితే ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం ఆదివారాల్లో కూడా వర్కింగ్ షిఫ్ట్‌‌లు కేటాయించాల్సి వచ్చింది. తన జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆదివారం నాడు షూటింగ్‌లలో పాల్గొనకూడదనే కఠినమైన రూల్‌ను ఫిరోజ్ ఖాన్ పాటించేవారు. ఆ వ్యక్తిగత నిబంధనకు కట్టుబడి ఉండటమే ఆ భారీ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించడానికి ప్రధాన కారణమని సంజయ్ గుప్తా వెల్లడించారు.

అతిపెద్ద ప్రాజెక్ట్, అగ్ర హీరోతో కలిసి పనిచేసే అవకాశం వ‌చ్చినా? ఫిరోజ్ ఖాన్ వ్యక్తిగత విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని సంజయ్ గుప్తా కొనియాడారు. కేవలం సినిమా క్రేజ్ .. కమర్షియల్ లాభాల కోసం తన రూల్స్‌ను మార్చుకోని వ్యక్తిత్వం ఆయన సొంతమని తెలిపారు. ఆదివారాల్లో పని చేయననే ఆయన పట్టుదల కారణంగానే అద్భుతమైన కాంబినేషన్ వెండితెరపై సాధ్యపడలేదని పేర్కొన్నారు.

ఫిరోజ్ ఖాన్ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత ఆ పాత్రలోకి టాలెంటెడ్ నటుడు వినోద్ ఖన్నా ఎంట్రీ ఇచ్చారు. అటుపై అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా కాంబినేషన్‌లో తెర‌కెక్కిన `హేరా ఫేరి` బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా ఇద్ద‌రి కాంబోకి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒకవేళ ఫిరోజ్ ఖాన్ కనుక ఆ షరతుకు అంగీకరించి ఉంటే ఆ సినిమా రూపురేఖలు , ఆన్-స్క్రీన్ కాంబినేషన్ పూర్తిగా భిన్నంగా ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాగే ఫిరోజ్ ఖాన్ మంచి మనస్తత్వాన్ని గురించి కూడా సంజయ్ గుప్తా ప్రస్తావించారు. తన కెరీర్ ప్రారంభంలో తనకు చిన్న చిన్న అవకాశాలు ఇచ్చిన చిన్న స్థాయి ఫిలింమేకర్లను, దర్శకులను ఆయన ఎప్పుడూ మర్చిపోలేదని వారికి ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండేవారని గుర్తు చేశారు. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ కొన్ని ప్రత్యేక సిద్ధాం తాలను, విలువలను జీవితాంతం పాటించిన నిజమైన జెంటిల్మన్ ఫిరోజ్ ఖాన్ అని కొనియాడారు.

Tags:    

Similar News