వార్ డ్రామా నుంచి లస్ట్ స్టోరీస్ వరకు!

డిజిటల్ మాధ్యమాల విస్తరణతో నటులకు విభిన్నమైన పాత్రలను పోషించేందుకు అద్భుతమైన వేదిక లభించిందని నటుడు సిద్ధార్థ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

Update: 2026-09-30 12:45 GMT

డిజిటల్ మాధ్యమాల విస్తరణతో నటులకు విభిన్నమైన పాత్రలను పోషించేందుకు అద్భుతమైన వేదిక లభించిందని నటుడు సిద్ధార్థ్ అభిప్రాయ‌ప‌డ్డారు. వైవిధ్యమైన మనస్తత్వాలు, పూర్తి భిన్నమైన నేపథ్యాలు ఉన్న పాత్రలను అతితక్కువ వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఓటీటీల ద్వారానే సాధ్యమవుతోందని పేర్కొన్నారు. తాజా డిజిటల్ సిరీస్‌లు, ప్రాజెక్టులను ఉదాహరణగా చూపిస్తూ సిద్దార్ద్ ఓ చ‌ర్చ‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 90 రోజుల వ్యవధిలోనే తాను పూర్తి భిన్నమైన రెండు పాత్రల్లో కనిపించగలిగానని సిద్ధార్థ్ గుర్తు చేసుకున్నారు.

`ఆపరేషన్ సేఫ్డ్ సాగర్` అనే వార్ డ్రామా సిరీస్‌లో దేశం కోసం పోరాడే రక్షణ దళ అధికారి అజయ్ అహుజాగా నటించిన సిద్దార్ద్.. అదే సమయంలో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో `లస్ట్ స్టోరీస్ 3` ఆంథాలజీలో బద్రూ అనే వైవిధ్యమైన పాత్రను పోషించారు. కథల పరంగా, శైలి పరంగా రెండు పాత్రల మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నా? దర్శకులు తనపై ఉంచిన నమ్మకమే ఆ క్యారెక్టర్లలో లీనమయ్యేలా చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా `లస్ట్ స్టోరీస్ 3` ప్రాజెక్ట్ గురించి సిద్ధార్థ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళల కోరికలు, ఆలోచనా ధోరణి , వారి ఫాంటసీల చుట్టూ కథనాలను నడిపించడం ఎంతో ప్రగతిశీలమైన అడుగని అభిప్రాయపడ్డారు.

సమాజంలో మహిళల కోరికలు, ఆలోచనలపై కూడా విస్తృతంగా మాట్లాడటం ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలు ఇలాంటి కొత్తదనంతో కూడిన, ఆసక్తికరమైన కంటెంట్‌ను ముందుకు తీసుకురావడాన్ని కొనియాడారు. `ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు? క్రియేటర్లు ఏం ఆలోచిస్తున్నారు? సాహసోపేత కంటెంట్ భవిష్యత్తును ఎలా మారుస్తోంది? అనే అంశంపై ఈ ప్రత్యేక చర్చ జరిగింది. సిద్ధార్థ్‌తో పాటు ప్రముఖ దర్శకులు సురేష్ త్రివేణి, ఫరా ఖాన్, నటుడు రితీష్ దేశ్‌ముఖ్, రైటర్-షోరన్నర్ అభిజీత్ సింగ్ పర్మార్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షేర్గిల్ ఈ ప్యానెల్‌లో పాల్గొన్నారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ వినోదం ఎటువైపు పయనిస్తోందో ఈ వేదికగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు సురేష్ త్రివేణి స్పందించారు. కంటెంట్ రూపకల్పనలో పాత డేటా, అల్గారిథమ్‌లపై ఆధారపడటం కంటే ముందస్తు ఆలోచనలతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే తన ప్రాథమిక సూత్రమని, డిజిటల్ , రియాలిటీ షోల ద్వారా మానవ స్వభావాన్ని, విభిన్న భావోద్వేగాలను లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు.

ఇదే చర్చలో పాల్గొన్న నటుడు రితీష్ దేశ్‌ముఖ్ `లాక్ అప్` రియాలిటీ షో అనుభవాలను పంచుకున్నారు. సెలబ్రిటీల వ్యక్తిత్వాలను కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు ఈ తరహా షోలు ఉపయోగపడతాయని తెలిపారు. కాగా, నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి మోనికా షేర్గిల్ స్పందిస్తూ.. `లాక్ అప్: సచ్ యా సజా` సీజన్ 2ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి ఓటీటీల రాకతో నటులకు విస్తృత అవకాశాలతో పాటు క్రియేటర్లకు కూడా సరికొత్త ప్రయోగాలు చేసే స్వేచ్ఛ లభిస్తోందన్న‌ది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News