సక్సెస్ కిక్కు ఆదిత్యా ధర్ నెత్తికెక్కిందా? భార్య ఏం చెప్పారంటే!
సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ విజయం పలకరించగానే చాలామంది ప్రవర్తనలో మార్పు వస్తుందని.. `సక్సెస్ కిక్కు` నెత్తికెక్కుతుందని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన `మ్యూజింగ్స్`లో తరచుగా చెబుతుంటారు.;
సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ విజయం పలకరించగానే చాలామంది ప్రవర్తనలో మార్పు వస్తుందని.. `సక్సెస్ కిక్కు` నెత్తికెక్కుతుందని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన `మ్యూజింగ్స్`లో తరచుగా చెబుతుంటారు. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన `ధురంధర్` ఫ్రాంఛైజీ దర్శకుడు ఆదిత్యా ధర్ విషయంలో మాత్రం ఇది అస్సలు వర్తించదని అతడి భార్య, నటి యామీ గౌతమ్ స్పష్టం చేశారు. ఎంతటి ఘనవిజయం సాధించినా.. ఎన్ని రికార్డులు తిరగరాసినా.. ఆదిత్యాలో అణుమాత్రం మార్పు రాలేదని.. ఆయన ఇప్పటికీ ఎంతో వినయంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఆదిత్యా ధర్ కెరీర్‌లో కేవలం విజయాలే కాకుండా, ఎన్నో ఎత్తుపల్లాలు, సంక్లిష్ట పరిస్థితులను తాను దగ్గరుండి చూశానని యామీ వెల్లడించారు. ఆ కష్ట కాలంలో కూడా ఆయన ఎప్పుడూ అసహనం వ్యక్తం చేయలేదని.. నిరాశకు లోనుకాలేదని యామీ గుర్తు చేసుకున్నారు. విజయ గర్వం తలకెక్కకుండా ఉండటానికి ఆయన ఆధ్యాత్మిక చింతనే ప్రధాన కారణమని యామీ అభిప్రాయపడ్డారు. దైవబలంపై నమ్మకం ఉన్నవారికి దక్కాల్సింది కాస్త ఆలస్యంగానైనా కచ్చితంగా దక్కుతుందని.. మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ దంపతులు బలంగా నమ్ముతారు.
సినిమా అనేది ఎప్పుడూ దర్శకుడి మాధ్యమమేనని.. మంచి స్క్రిప్ట్ వంటి ప్రాథమిక సూత్రాలే చిత్రాన్ని నిలబెడతాయని యామీ విశ్లేషించారు. `ధురంధర్` ఫ్రాంచైజీ సాధించిన భారీ విజయం కేవలం బాక్సాఫీస్ రికార్డుల కోసమే కాదని.. ఇది పరిశ్రమలో మళ్లీ `బేసిక్స్`కు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేసిందని అన్నారు. థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావడానికి ఇండస్ట్రీ మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో ఈ చిత్రం సాధించిన వసూళ్లు మేకర్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ ఒక అద్భుతమైన ఎదుగుదల దిశగా ప్రయాణిస్తోంది. `ధురంధర్: ది రివెంజ్` ఏకంగా 1700కోట్లు వసూలు చేసింది. ఇంకా బాహుబలి 2 నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డుకు చేరువలో ఉండటం విశేషం. మంచి కథాబలం ఉన్న చిత్రాలను రూపొందిస్తే ప్రేక్షకులు ఎన్నిసార్లయినా థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉన్నారనే బలమైన సందేశాన్ని ఈ విజయం ఇచ్చింది.
ఇక యామీ కెరీర్ విషయానికి వస్తే.. దురంధర్ 2లో అతిథి పాత్ర తర్వాత... నయి నవేలి అనే హారర్-కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యామీ ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతున్నారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన అనంతరం పాపులర్ ఓటిటి ప్లాట్‌ఫారమ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. భర్త దర్శకుడిగా రికార్డులు సృష్టిస్తుంటే.. భార్యగా యామీ తనదైన సహకారం అందిస్తూ అతడి విజయంలో భాగమవుతోంది. అదే సమయంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇద్దరూ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కపుల్‌గా నిలుస్తున్నారు. యామీ గౌతమ్ కెరీర్ ఆరంభంలో టాలీవుడ్ లో తరుణ్ సరసన యుద్ధం అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.