సినిమాల‌పై మౌత్ టాక్ ప్రభావం ఎంత‌?

కోట్లు ఖర్చు పెట్టి చేసే భారీ ప్రమోషన్ల కంటే? ప్రేక్షకుడి నుంచి వచ్చే మౌత్ టాక్ ఎప్పుడూ టాప్ లో ఉంటుందని పదే పదే రుజువవుతూనే ఉంది.

Update: 2026-08-11 09:33 GMT

కోట్లు ఖర్చు పెట్టి చేసే భారీ ప్రమోషన్ల కంటే? ప్రేక్షకుడి నుంచి వచ్చే మౌత్ టాక్ ఎప్పుడూ టాప్ లో ఉంటుందని పదే పదే రుజువవుతూనే ఉంది. ఏ అంచనాలు లేకుండా సైలెంట్‌గా విడుదలై ప్రేక్షకుల మౌత్ టాక్‌తోనే కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఈ మధ్య కాలంలో చాలానే ఉన్నాయి. ఫస్ట్ డే మార్నింగ్ షో ఫలితాలతో సంబంధం లేకుండా రెండు మూడు రోజుల్లో నైట్ షోస్ -వీకెండ్ కలెక్షన్‌లతో వసూళ్ల సునామి సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిత్ర పరిశ్రమను శాసించే శక్తిగా మౌత్ టాక్ ఎలా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది.

సినిమా బాగుంటే ఎవ‌రూ ఆపలేరు, బాగోలేకపోతే? ఎన్ని ప్రమోషన్లు చేసినా కాపాడలేరు అనేది ఇండస్ట్రీలో ఎప్పటికీ మారని సింపుల్ ఫార్ములా. మౌత్ టాక్ బాగుందా? నిర్మాత నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే ఆడియన్సే ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుంటారు. తాజాగా లోకేష్ కనకరాజ్ నటించిన చిత్రం విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. `డీసీ` చిత్రం సైలెంట్ గా విడుదలై వైలెంట్ గా దూసుకుపోవడానికి ప్రధాన కారణం ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ టాక్. మొదటి రోజు వచ్చిన గ్రాస్‌తో పోలిస్తే రెండు మూడు రోజుల్లో వ‌చ్చిన‌ వసూళ్లు రెట్టింపు అవుతుండటం చూస్తే మౌత్ టాక్ పవర్ ఏంటో? అర్థమవుతుంది.

ఇదే కోవలో వరుణ్ తేజ్ నటించిన `కొరియన్ కనకరాజు` సినిమాకు కూడా మౌత్ టాక్ బాగానే హెల్ప్ అయింది. సినిమా పర్లేదు, హాయిగా నవ్వుకోవచ్చు అనే టాక్ బయటకు వెళ్లడంతో మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి ఊరటనిచ్చింది. కొంత కాలంగా సరైన హిట్ లేని వరుణ్ తేజ్‌కు ఈ చిత్రం కంబ్యాక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. గ‌తంలో సూర్య నటించిన `వీరభద్రుడు`, ఇతర డబ్బింగ్ చిత్రాలకు సైతం మౌత్ టాక్ బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ డే మార్నింగ్ షోతో పోలిస్తే రెండు మూడు రోజుల్లో ఈ చిత్రాల వసూళ్ల మోత మోగిపోతుండటమే ఇందుకు నిదర్శనం.

ఈ విషయాన్ని ఇటీవల ట్రేడ్ వర్గాలు .. ప్రముఖ నిర్మాతలు కూడా బహిరంగంగా అంగీకరిస్తున్నారు. అంచనాలు లేకుండా విడుదలైన `నారీ నారి నడుమ మురారి`, `చెన్నై లవ్ స్టోరీ`, `మా ఇంటి బంగారం` లాంటి సినిమాలన్నీ మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకున్నాయి. ఎలాంటి పెద్ద బజ్ లేకుండా బరిలోకి దిగిన ఈ సినిమాలన్నీ వర్డ్ ఆఫ్ మౌత్ పవర్‌తో వీకెండ్ నాటికే సేఫ్ జోన్లోకి దూసుకెళ్లాయి. దీన్ని బట్టి చూస్తే కంటెంట్ లో నిజాయితీ ఉంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారన్న‌ది క్లియ‌ర్.

భారీ బడ్జెట్ హంగులు, ప్రమోషన్ల హోరు ఎంత ఉన్నా? సినిమా చూసిన సాధారణ ప్రేక్షకుడూ సోషల్ మీడియా ద్వారా లేదంటే నేరుగా పది మందికి చెప్పే పాజిటివ్ రివ్యూనే అసలైన పబ్లిసిటీ. సినిమా రిజల్ట్‌ను డిసైడ్ చేసేది ఆడియన్స్ ఇచ్చే తీర్పే తప్ప మేకర్స్ వేసే అంచనాలు కాదని నేటి ట్రెండ్ నిరూపిస్తోంది. లాంగ్ రన్‌లో సినిమా నిలబడాలన్నా? బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవాలన్నా? మౌత్ టాక్ ప్రధానమైన ఇంజిన్‌లా పనిచేస్తుంది. అందుకే డైరెక్టర్లు ..ప్రొడ్యూసర్లు అందరూ ప్రమోషన్ల కంటే పక్కా కంటెంట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

మౌత్ టాక్ బాగుంటే ఆ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఏ శక్తి కూడా ఆపలేదు అనేదానికి ఈ సినిమాలే నిలువెత్తు నిదర్శనం. చిత్ర పరిశ్రమలో మారుతున్న సమీకరణాలు చిన్న సినిమాలకు పెద్ద బలాన్ని ఇస్తుండగా.. కంటెంట్ ఉన్న ప్రతి చిన్న చిత్రానికి మంచి భవిష్యత్తును అందిస్తున్నాయి. భారీ తారాగణం, కోట్ల ఖర్చుతో కూడిన పబ్లిసిటీ కంటే ప్రేక్షకుల సంతృప్తే అతిపెద్ద సక్సెస్ మంత్రంగా మారుతోంది. భవిష్యత్తులో కూడా ఈ ట్రెండే ఇండియన్ బాక్సాఫీస్ ఫలితాలను శాసించగ‌ల‌ద‌న్న‌ది అంతే వాస్త‌వం.

Tags:    

Similar News