కృష్ణ గారి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన నటశిఖరం, సాహసాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ.

Update: 2026-05-31 10:03 GMT

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన నటశిఖరం, సాహసాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ. వెండితెరపై ఆయన చేసిన ప్రయోగాలు, సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌ను సరికొత్త టెక్నాలజీ వైపు నడిపించిన మార్గదర్శి ఆయన. మే 31న ఆయన జయంతి సందర్భంగా, ఈ మహానటుడి జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం..

బుర్రిపాలెం నుంచి టాలీవుడ్ వరకు:

సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1942 మే 31న తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జన్మించారు. కాలేజీ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి జరిగిన ఒక సన్మానాన్ని చూసి, ఆయన స్ఫూర్తితో నటన వైపు అడుగులు వేశారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు 'తేనెమనసులు' సినిమాతో కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ ఆయన పేరును 'కృష్ణ'గా మార్చారు.

టెక్నాలజీ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్:

తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కృష్ణ గారిదే. తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), మొదటి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి కలర్ సినిమా, మొదటి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), మరియు టాలీవుడ్‌లో మొదటి 70 ఎంఎం సినిమా (సింహాసనం) ఇలా ఎన్నో ప్రయోగాలు ఆయన ఖాతాలోనే ఉన్నాయి.

మూడు షిఫ్ట్‌ల హీరో.. కార్మికుల పక్షపాతి:

కృష్ణ గారు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఏకంగా 350కి పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. ఒకే ఏడాది (1972లో) ఏకంగా 18 సినిమాలు విడుదల చేసిన ఘనత ఆయనది. సినీ కార్మికులకు నిరంతరం పని దొరకాలనే మంచి ఉద్దేశంతో ఆయన రోజుకు మూడు షిఫ్ట్‌లు కూడా కష్టపడి పని చేసేవారు.

నిర్మాతలను కాపాడే మంచి మనసు:

కృష్ణ గారు కేవలం గొప్ప నటుడే కాదు, అంతకుమించి భేషజాలు లేని మంచి మనిషి. తనతో సినిమా తీసి ఏ నిర్మాత అయినా నష్టపోతే, వెంటనే పిలిచి పైసలు తీసుకోకుండా డేట్లు ఇచ్చి ఇంకో సినిమా చేసేవారు. సినిమా విడుదలకు ముందు నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తన పారితోషికాన్ని సైతం వదులుకునే అంతటి ఉదార స్వభావం ఆయనది.

స్టాంప్ విడుదల చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం:

కృష్ణ గారి నటనకు, సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. విదేశీ ప్రభుత్వం ఒక తెలుగు హీరోకు ఇలాంటి గౌరవం ఇవ్వడం చాలా అరుదైన విషయం.

హాలీవుడ్ రేంజ్ క్రేజ్ – 400 బస్సులు:

కృష్ణ గారి 'సింహాసనం' సినిమా శతదినోత్సవ వేడుకను మద్రాసులో జరిపినప్పుడు, ఆంధ్రప్రదేశ్ నుండి ఏకంగా 400 బస్సుల్లో 30 వేల మందికి పైగా అభిమానులు తరలివెళ్లారు. అంతమంది జనాన్ని చూసి తమిళనాడు ప్రభుత్వ అధికారులు సైతం షాక్ అయ్యారు.

రికార్డుల ద్విపాత్రాభినయాలు:

కృష్ణ గారు తన కెరీర్‌లో ఏకంగా 25 సినిమాల్లో డబుల్ రోల్, అలాగే 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి అప్పట్లోనే సరికొత్త రికార్డు సృష్టించారు.

బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలి టాలీవుడ్ హీరో:

టాలీవుడ్ నుండి హిందీ చిత్రరంగంలోకి బాలీవుడ్ అడుగుపెట్టిన మొదటి హీరో కృష్ణ గారే కావడం విశేషం.

వరుస సంక్రాంతి రికార్డు:

ఇక 1976 నుండి 1996 వరకు.. దాదాపు 21 సంవత్సరాల పాటు ప్రతి ఏటా వరుసగా సంక్రాంతి పండుగకు కృష్ణ గారి సినిమా కచ్చితంగా థియేటర్లలోకి వచ్చేది. ఇక ఇలా ఏ హీరో కూడా వరుసగా ఇన్నేళ్లు సంక్రాంతి బరిలో నిలవలేదు.

సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ కృష్ణ గారు రాణించారు. ఇక 1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున లోక్‌సభ సభ్యునిగా (ఎంపీ) గెలిచారు. ఆయన నటనకు, సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2009లో 'పద్మభూషణ్' పురస్కారంతో సత్కరించింది. అలాగే నంది అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ఆయన్ను వరించాయి.

తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన చూపిన బాట, చేసిన ప్రయోగాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇక నటుడిగా, నిర్మాతగా, అన్నింటికీ మించి ఒక మంచి మనిషిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన మన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం

Tags:    

Similar News