వార్-2 : చివరి క్షణంలో రన్ టైమ్ ట్విస్ట్!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) జారీ చేసిన తాజా సర్టిఫికేట్ ప్రకారం, వార్ 2కు UA 16+ సర్టిఫికేషన్ లభించింది.;

Update: 2025-08-12 07:24 GMT

బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రూపొందిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తారక్ బాలీవుడ్‌లో తన మార్కెట్ పెంచుకునేలా అడుగుపెడుతున్నారు. అయితే రిలీజ్‌కు కొన్ని రోజులు ముందు, సినిమా రన్‌టైమ్, సెన్సార్ కట్‌లపై వచ్చిన అప్‌డేట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) జారీ చేసిన తాజా సర్టిఫికేట్ ప్రకారం, వార్ 2కు UA 16+ సర్టిఫికేషన్ లభించింది. అంటే, 16 సంవత్సరాల లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే చూడగలిగేలా అనుమతి ఉంది. మొదటగా సెన్సార్‌కు సమర్పించినప్పుడు చిత్ర రన్‌టైమ్ 179 నిమిషాలు 49 సెకన్లు ఉండేది. సెన్సార్ సూచనల మేరకు కొన్ని డైలాగ్‌లు తొలగించడం, కొన్ని ఇమేజ్‌లను తగ్గించడం, కొన్ని రిఫరెన్స్‌లను మ్యూట్ చేయడం వంటి మార్పులు చేశారు.


అయితే ఇక్కడితో మార్పులు ఆగలేదు. సెన్సార్ చేసిన వెర్షన్ నుండి కూడా మేకర్స్ మరో 6 నిమిషాల పైగా ఫుటేజ్‌ను ట్రిమ్ చేశారని తెలుస్తోంది. దీంతో ఫైనల్ రన్‌టైమ్ 173 నిమిషాలుగా కుదిరింది. ఈ మార్పులు ప్రధానంగా కథలోని కొన్ని సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ముందుగానే బయటపడకుండా ఉండడానికే చేసినట్లు సమాచారం. తెలుగు వెర్షన్‌లో హిందీ వెర్షన్‌తో పోలిస్తే కొన్ని అదనపు ట్రిమ్మింగ్స్ ఉన్నాయని కూడా టాక్ ఉంది.

సినిమా లెంగ్త్ తగ్గించడం వెనుక మరో కారణం పేస్ మెయింటైన్ చేయడమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్స్‌లో పేస్ తగ్గితే ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోవచ్చు. అందుకే, కొన్ని సీన్స్‌ను కత్తిరించడం ద్వారా నేరేషన్‌ను క్రిస్ప్‌గా ఉంచేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మార్పులు థియేటర్లలో ఫైనల్ ఇంపాక్ట్ ఎంత ఇస్తాయో విడుదలైన తర్వాతే తెలుస్తుంది.

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రంలో మెయిన్ హైలెట్ గా ఉండనున్నాయి. కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో నటించారు. అయితే, సెన్సార్ ట్రిమ్మింగ్స్‌లో ఆమె బికినీ సీన్స్‌పై కూడా కొంత కత్తెర పడినట్లు సమాచారం. ఈ మార్పులు సినిమాలో మొత్తం ఫ్లోపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి. ప్రస్తుతం వార్-2కు బుకింగ్స్ మితంగా కొనసాగుతున్నాయి. రిలీజ్‌కు ముందు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags:    

Similar News