వార్ 2 పెయిడ్ షోలు.. అమెరికాలో క్రేజ్ లేదా?
యష్ రాజ్ ఫిలింస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన `వార్ 2` ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.;
యష్ రాజ్ ఫిలింస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన `వార్ 2` ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఈ చిత్రంలో నువ్వా నేనా? అంటూ ఢీకొడుతుండడంతో ఇరువురి ఫ్యాన్స్ లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పై యూనివర్శ్‌లో ఏ పాత్రను ఏవిధంగా మలిచారో చూడాలనే ఉత్సుకత అభిమానుల్లో నెలకొంది. దీంతో ఈ సినిమా తొలి వీకెండ్ ర్యాంపేజ్ పై ట్రేడ్ భారీ అంచనాలు వేస్తోంది.
అక్కడ హృతిక్ క్రేజ్ పైనే హోప్స్:
ఒక అంచనా ప్రకారం.. వార్ 2 ఉత్తరాది బెల్ట్ ని మించి తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లడానికి తారక్ మాస్ ఫాలోయింగ్ సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు. వార్ సక్సెస్ నేపథ్యంలో హృతిక్ క్రేజ్ తో నార్త్ లోను వార్ 2 భారీ వసూళ్లను సాధించేందుకు ఆస్కారం ఉంది.
తెలుగు వెర్షన్ బెటర్:
అయితే ఈ సినిమా కోసం అమెరికాలో ప్రీబుకింగులు మొదలవ్వగా హిందీ వెర్షన్ బుకింగులు తీవ్రంగా నిరాశపరిచాయి. తెలుగు వెర్షన్ ఫరవాలేదనిపించినా హిందీ వెర్షన్ టికెట్లు మాత్రం సేల్ కాలేదని ట్రేడ్ చెబుతోంది.
విడుదలకు 10 రోజుల ముందు `వార్ 2` కోసం అమెరికాలో ప్రీటికెట్ల అమ్మకం మొదలైనా ఆశించిన స్థాయికి చేరుకోలేదని తెలుస్తోంది. ప్రీ-సేల్స్ ప్రారంభించిన ఒక రోజు తర్వాత తెలుగు వెర్షన్ కొంత వేగం పుంజుకున్నా కానీ, హిందీ వెర్షన్ చాలా వెనుకబడి ఉందని ట్రేడ్ చెబుతోంది.
ఒక్క టికెట్ అయినా సేల్ కాలేదు:
ముఖ్యంగా కొన్ని ఆన్ లైన్ టికెటింగ్ వేదికలను పరిశీలిస్తే.. హిందీ వెర్షన్ టికెట్ సేల్ తీసికట్టుగా మారిందని, వైఆర్ఎఫ్ బుధవారం ప్రీమియర్‌ల కోసం ప్లాన్ చేయగా ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల వివరాల ప్రకారం పెయిడ్ ప్రివ్యూల కోసం అమెరికాలోని 900 స్క్రీన్‌లలో వార్ 2 హిందీ వెర్షన్‌ని విడుదల చేస్తోంది. ఆదివారం ఉదయం నాటికి ఆ 900 స్థానాల్లో 1600 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని, దాదాపు అన్ని థియేటర్లు ఖాళీగా ఉన్నాయని హిందూస్తాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే తెలుగు వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ పవర్‌పై ఆధారపడి చాలా మెరుగ్గా టికెట్లు తెగుతున్నాయి. వార్ 2 తెలుగు వెర్షన్ షోలు ఇప్పటికే మంచి ఆక్యుపెన్సీని అందుకుంటున్నాయి. బుధవారం ప్రీమియర్లకోసం అమెరికాలో 100కె డాలర్ల కలెక్షన్లు దాటాయి. అయితే 1 మిలియన్ డాలర్ సేల్ చేస్తేనే అది మెరుగైన ఫలితమని కూడా విశ్లేషిస్తున్నారు.
ఈ టైప్ కల్చర్ అక్కడ లేదు:
తెలుగు వెర్షన్ తో పోలిస్తే, హిందీ వెర్షన్ టికెట్ సేల్ తీసికట్టుగా ఉండటానికి కారణాలను విశ్లేషిస్తే, పెయిడ్ ప్రివ్యూలు, బుధవారమే ప్రీమియర్ షోలు వేసే కల్చర్ హిందీ పరిశ్రమలో లేనే లేదు. తొలి రోజే సినిమాని చూడాలనే తపన హిందీ ఆడియెన్ కి ఎప్పుడూ లేదు. ఇలాంటి తీవ్రమైన, దూకుడైన కల్చర్ దక్షిణాది(తెలుగు, తమిళం)కి మాత్రమే పరిమితం. ఇక్కడ తమ ఫేవరెట్ స్టార్ కోసం మాస్ ఫ్యాన్స్‌లో పూనకాలు పుట్టుకొస్తాయి. ఎంత ఖర్చయినా చేతి చమురు వదిలించుకునేందుకు కూడా అభిమానులు వెనకాడరు. దీంతో పోలిస్తే, ఉత్తరాదిన అలాంటి కల్చర్ ఉండదు. అందువల్ల వార్ 2 హిందీ వెర్షన్ పెయిడ్ ప్రివ్యూలకు టికెట్లు తెగడం లేదని కూడా విశ్లేషిస్తున్నారు. మొదటి రోజే సినిమా చూసేయాలనే ఉత్సుకత హిందీ బెల్ట్ తో పోలిస్తే దక్షిణాదిన ఉధృతంగా ఉంటుంది. ఇది భారీ కలెక్షన్లకు సహకరిస్తుంది. `వార్ 2` విషయంలో ప్రస్తుతానికి పరిస్థితులు తలకిందులుగా ఉన్నాయని ట్రేడ్ చెబుతోంది. అమెరికాలో పెయిడ్ ప్రివ్యూల మాట ఎలా ఉన్నాకానీ, భారతదేశంలో అయినా హిందీ వెర్షన్ ఉత్తమంగా రాణించాలని ట్రేడ్ ఆశిస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2లో గూఢచారులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కియరా అద్వాణీ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.