నా జడ్జిమెంట్ ఫెయిల్ కాదు: నరేష్ తుపాకీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

ఈ సినిమా అసలు కాన్సెప్ట్ గురించి చెబుతూ, ఇందులో తండ్రే హీరో, కూతురే హీరోయిన్ అని ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

Update: 2026-10-14 06:53 GMT

దసరా బరిలో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న చిత్రం 'క్రేజీ కళ్యాణం'. ఈ సినిమా ట్రైలర్ కు ఆర్గానిక్ గా 8 లక్షలకు పైగా వ్యూస్ రావడం పట్ల సీనియర్ నటుడు వీకే నరేష్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. Tupaki.com కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇది ఎలాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదని, పక్కా తెలుగు నేటివిటీ ఉన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని క్లారిటీ ఇచ్చారు. ఒక అనుభవజ్ఞుడైన నటుడిగా తన జడ్జిమెంట్ ఫెయిల్ కాదని నరేష్ కాన్ఫిడెంట్ గా చెప్పారు.

ఈ సినిమా అసలు కాన్సెప్ట్ గురించి చెబుతూ, ఇందులో తండ్రే హీరో, కూతురే హీరోయిన్ అని ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇది చాలా అరుదుగా వచ్చే సబ్జెక్ట్ అని, ప్రతి కాలేజ్ అమ్మాయితో పాటు కుటుంబాలందరికీ ఈ థీమ్ బాగా కనెక్ట్ అవుతుందని ఆయన వివరించారు. దర్శకుడు బద్రి ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ను ఆర్గానిక్ గా బ్లెండ్ చేసిన తీరు ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుందని చెప్పారు.

సినిమాలో తరుణ్ భాస్కర్ తో తన కాంబినేషన్ హిలేరియస్ గా ఉంటుందని నరేష్ వెల్లడించారు. తరుణ్ ఒక గొప్ప నటుడని, ఈ సినిమాలో తరుణ్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా అద్భుతంగా చేశాడని ప్రశంసించారు. తాను ఎమోషన్స్ ను లీడ్ చేస్తే, తరుణ్ కామెడీ టైమింగ్ తో చింపేశాడని అన్నారు. మామ అల్లుళ్ల మధ్య నడిచే ఆర్గానిక్ ఫన్, తండ్రీకూతుళ్ల ట్రాక్ సినిమాకు మేజర్ ప్లస్ అవుతాయన్నారు.

దర్శకుడు బద్రిని దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ గారితో పోల్చడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని నరేష్ క్లారిటీ ఇచ్చారు. తానెప్పుడూ బద్రిని విశ్వనాథ్ అంతటి గొప్ప దర్శకుడు అనలేదని, అయితే పాత్రల్లోని కొత్తదనాన్ని బయటకు తీయడం, నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడంలో ఆయనలోని కొన్ని క్వాలిటీస్ బద్రిలో కనిపించాయని మాత్రమే తాను మనస్ఫూర్తిగా చెప్పానని స్పష్టం చేశారు.

సినిమా నచ్చకపోతే తన టవర్స్ కు వచ్చి కలవండి అంటూ ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ పై నరేష్ స్పందించారు. సినిమా వంద కోట్లు చేయకపోతే అడగండి అనడం అహంకారం అవుతుందని, కానీ కంటెంట్ బాగోలేకపోతే ఎందుకు నచ్చలేదో వచ్చి ఓపెన్ గా చర్చించవచ్చని తాను సీరియస్ గానే చెప్పానన్నారు. డబ్బింగ్ సమయంలో సినిమా మొత్తం చూశానని, దానిపై ఉన్న నమ్మకంతోనే ఆ మాట అన్నానని స్పష్టం చేశారు.

ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నా తెలుగుకే ఎందుకు పరిమితమయ్యారు అన్న ప్రశ్నకు నరేష్ ప్రాక్టికల్ గా బదులిచ్చారు. సొంత ఇంటిని వదిలేసి ఆకాశాన్ని నమ్ముకోవడం తనకు ఇష్టం లేదని, తెలుగులో అద్భుతమైన క్యారెక్టర్లు వస్తున్నాయని చెప్పారు. యువ దర్శకులు తనను నిరంతరం అప్డేట్ చేస్తూ జెన్ జీ వరకు తీసుకెళ్లారని కొనియాడారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రెండు సినిమాలు చేస్తున్నానని, క్రేజీ కళ్యాణం కచ్చితంగా దసరాకు ప్రేక్షకులను అలరిస్తుందని నరేష్ ధీమా వ్యక్తం చేశారు.



Full View


Tags:    

Similar News