'అసరీరి' హిట్ అయితే నానితో 96 కన్ఫర్మ్..!
| దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘అసరీరి’ 2027 జనవరి 1న విడుదల కానుంది. ఈ సినిమా ఫలితంపై నాని అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయని, నాని సోదరి దీప్తి గంటా నిర్మించనున్నట్లు ప్రకటించారు. ‘అసరీరి’ విజయం సాధిస్తే వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
‘96’, ‘సత్యం సుందరం’ సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు సొంతం చేసుకున్న దర్శకుడు సి ప్రేమ్ కుమార్ ప్రస్తుతం తమిళ్ లో 'అసరీరి' సినిమాతో రాబోతున్నాడు. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ హీరోగా నటించిన ఈ సినిమాను 2027, జనవరి 1న విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. తమిళ్ మూవీ అయినప్పటికీ తెలుగులోనూ ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అదే టైటిల్‌తో ఈ సినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఇటీవలే తెలుగు వర్షన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సెన్సిబుల్ టాపిక్‌ను, చాలా సున్నితంగా డీల్ చేయగల నేర్పరి సి ప్రేమ్ కుమార్ అనే పేరు ఉంది. అందుకే ఆయన ఈ సినిమాను సైతం అదే తరహాలో డీల్ చేసి ఉంటాడని అంతా భావిస్తున్నారు. కనుక అసరీరి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా...
ప్రేక్షకులు మాత్రమే కాకుండా అసరీరి సినిమా విడుదల కోసం నేచురల్ స్టార్ నాని సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఒక సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. చివరి దశ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ కు దాదాపుగా నాని ఓకే చెప్పినట్లే అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాని సోదరి దీప్తి గంటా మాట్లాడుతూ నాని హీరోగా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్లుగా చెప్పారు. ఆ సినిమాను తానే స్వయంగా నిర్మించబోతున్నట్లుగానూ ఆమె ప్రకటించారు. ఇంటర్వ్యూలో ఆమె సినిమాను అనౌన్స్ చేసినప్పటికీ అధికారికంగా ఒక పోస్టర్ వచ్చే వరకు నూరు శాతం కన్ఫర్మ్ కాదు అనే విషయాన్ని గుర్తించాలి. ఇలా మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూల్లో చెప్పిన చాలా సినిమాలు పట్టాలు ఎక్కిన దాఖలాలు లేవు.
ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నాని సినిమా...
దీప్తి గంటా చెప్పినట్లుగా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నాని సినిమా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రేమ్ కుమార్ తాజా చిత్రం 'అసరీరి' మూవీ హిట్ కావాల్సి ఉందని కొందరు అంటున్నారు. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన అసరీరి మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే, ఆయన గత చిత్రాల మాదిరిగా సెన్సిబుల్ మూవీ అంటూ పేరు సొంతం చేసుకుంటే తప్పకుండా నాని వెంటనే డేట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా సైతం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో అసరీరి ఫలితంను బట్టి వచ్చే ఏడాది సమ్మర్ నుంచే ప్రేమ్ కుమార్ కు డేట్లు ఇచ్చిన ఆశ్చర్యం లేదని సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో నాని రెండు సినిమాలు విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక అందులో ఒకటి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించబోతున్న సినిమా అయ్యి ఉండవచ్చు.
సుజీత్, నాని బ్లడీ రోమియో..
నాని ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో అనే విభిన్నమైన సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి నాని తన నట విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థం లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత దీప్తి గంటా ప్రకటించినట్లుగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీతో నాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో జాను సినిమాకు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. అది 96 కి రీమేక్ అనే విషయం తెల్సిందే. మొదటి సారి ఒక డైరెక్ట్ తెలుగు సినిమాను ప్రేమ్ కుమార్ చేయబోతున్నాడు. అది అసరీరి హిట్ అయితే వెంటనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాని సెన్సిబుల్ పాత్రలను చేయడంలో దిట్ట, కానీ ఈ మధ్య కాలంలో పూర్తి విభిన్నమైన యాక్షన్, మాస్ పాత్రలు చేస్తున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రేమ్ కుమార్ వల్ల నాని పాత పాత్రను చూడబోతున్నామని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అసరీరి విడుదలైన వెంటనే నానితో ప్రేమ్ కుమార్ సినిమా ప్రకటన వస్తుందా అనేది చూడాలి.