నానితో ఈ కాంబినేషన్ బాగుంది కానీ..
| నాని, దర్శకుడు ప్రేమ్ కుమార్ కాంబినేషన్‌పై ఆసక్తి పెరుగుతోంది. అయితే నాని పెరిగిన కమర్షియల్ మార్కెట్‌కు ప్రేమ్ కుమార్ సున్నితమైన కథనశైలికి మధ్య సమతూకం కీలకం కానుంది. భారీ బడ్జెట్‌తో కాకుండా, నాని ఇమేజ్‌కు తగ్గ ఎంటర్టైన్మెంట్, పేసింగ్‌తో పరిమిత బడ్జెట్లో సినిమా తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నాని ‘బ్లడీ రోమియో’తో బిజీగా ఉన్నారు.
న్యాచురల్ స్టార్ నాని, తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ కాంబినేషన్ గురించి చాలా రోజులుగా అనేక రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. రీసెంట్ గా 'అలియాస్ రుక్మిణి' ప్రమోషన్స్ లో నాని సోదరి దీప్తి గంటా ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇవ్వడంతో అంచనాలు మొదలయ్యాయి. క్లాస్ సినిమాల లవర్స్ కు ఈ కలయిక బాగా నచ్చుతున్నా, ట్రేడ్ వర్గాల్లో మాత్రం మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదే నాని కమర్షియల్ మార్కెట్ కు, ప్రేమ్ కుమార్ సున్నితమైన మేకింగ్ కు మధ్య ఉన్న గ్యాప్.
నాని ఇప్పుడు కేవలం ఎమోషనల్ డ్రామాలు చేసే మీడియం రేంజ్ హీరో కాదు. 'దసరా', 'సరిపోదా శనివారం', 'హిట్ 3' సినిమాల తర్వాత ఆయన బాక్సాఫీస్ స్టామినా పూర్తిగా మారిపోయింది. ది ప్యారడైజ్ టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ లెక్క 150 కోట్లు దాటింది. మొదటి రోజు ఓపెనింగ్స్ నుంచి థియేట్రికల్ బిజినెస్ వరకు నాని రేంజ్ భారీగా పెరిగింది.
గతంలో 'నిన్ను కోరి', 'హాయ్ నాన్న' లాంటి సాఫ్ట్ సినిమాలతో హిట్లు కొట్టినా, అప్పటి మార్కెట్ లెక్కలకు, ఇప్పటి నాని ఇమేజ్ కు చాలా తేడా ఉంది. మరోవైపు దర్శకుడు ప్రేమ్ కుమార్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఒక భిన్నమైన కోణం కనిపిస్తుంది. విజయ్ సేతుపతి, త్రిషలతో ఆయన తీసిన మొదటి సినిమా '96' కల్ట్ హిట్ గా నిలిచింది. కానీ అదే కథను తెలుగులో శర్వానంద్, సమంతలతో 'జాను'గా రీమేక్ చేస్తే ఆశించిన ఫలితం రాలేదు.
ఇక కార్తీ, అరవింద్ స్వామిలతో తీసిన రెండో సినిమా 'సత్యం సుందరం'కు విమర్శకుల మెప్పు దక్కినా, థియేటర్లలో పెద్దగా లాభాలు రాలేదని ప్రేమ్ కుమార్ స్వయంగా ఒప్పుకున్నారు.
ఇక్కడే ప్రేమ్ కుమార్ కు అసలైన కమర్షియల్ ఛాలెంజ్ ఎదురుకాబోతోంది. ఆయన సినిమాల్లో భారీ ఫైట్లు, హీరోయిజం ఎలివేషన్లు ఉండవు. కేవలం పాత్రల మధ్య నడిచే మాటలు, జ్ఞాపకాలు, ఎమోషన్స్ చుట్టూనే కథ సాగుతుంది.
అయితే నాని లాంటి స్టార్ హీరో సినిమాకు థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడవుతాయి. అలాంటప్పుడు కేవలం మంచి రివ్యూలు వస్తే సరిపోదు, పెట్టిన పెట్టుబడికి తగ్గ వసూళ్లు రాబట్టడం చాలా అవసరం. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అవ్వాలంటే బడ్జెట్ కంట్రోల్, బిజినెస్ లెక్కలు కీలకం కానున్నాయి. ప్రేమ్ కుమార్ తన నేచురల్ స్టోరీ టెల్లింగ్ ను కొనసాగిస్తూనే, నాని ఆడియన్స్ కోరుకునే ఎంటర్ టైన్ మెంట్, పేసింగ్ ఉండేలా స్క్రిప్ట్ డిజైన్ చేసుకోవాలి. కథకు తగ్గట్టుగా లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాను పూర్తి చేస్తే, ఈ జానర్ లోనూ మంచి లాభాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం నాని దర్శకుడు సుజీత్ తో 'బ్లడీ రోమియో' సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ తర్వాత ప్రేమ్ కుమార్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.