ఇంతకీ 'విశ్వంభర' పస్ట్ కాపీ రెడీనా?
| చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయ్యాయని, డబ్బింగ్ ప్రారంభించినట్లు చిత్రబృందం ప్రకటించింది. 2025, 2026 సంక్రాంతి విడుదల వాయిదా పడిన ఈ సినిమాను 2027 సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అదే పండుగకు చిరంజీవి మరో సినిమా ‘కాకా’ కూడా బరిలో ఉండటంతో విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. రీ రికార్డింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు పూర్తయ్యాక చిరంజీవి నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గురించి గత మూడు ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం అయింది. భారీ సోషియో ఫాంటసీ సినిమా అని, చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇదే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అంచనాలు పెరిగాయి. సినిమా ప్రారంభం సమయంలో 2025 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటన చేశారు. కానీ ఆ సంక్రాంతికి రాలేదు, కనీసం 2026 సంక్రాంతికి కూడా విడుదల కాలేదు. ఇప్పుడు 2027 సంక్రాంతికి విడుదల చేస్తాం అంటున్నారు. సినిమా ఇన్నాళ్లు ఆలస్యం కావడంకు ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్ అని మేకర్స్ చెబుతున్నారు. దర్శకుడు వశిష్ట ఈ సినిమాలో ఇప్పటి వరకు చూడని సరికొత్త లోకాలను చూపించాలనే ఉద్దేశంతో వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి ఎక్కువ సమయం తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
విశ్వంభర వీఎఫ్‌ఎక్స్ వర్క్ కంప్లీట్...
ముందుగా విజువలైజేషన్ చేయలేక పోవడం వల్ల వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతుందనే టాక్ కూడా ఉంది. కారణం ఏదైతేనేం షూటింగ్ పూర్తి అయ్యి దాదాపు రెండు ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవడం పై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ హీరో సినిమా, అది కూడా మెగాస్టార్ సినిమాను ఇలా సాగతీయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ చాలా మంది దర్శకుడు వశిష్టను ప్రశ్నిస్తున్నాడు. ముందస్తు ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్లే విశ్వంభర సినిమా ఇంత ఆలస్యం అయిందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. చాలా ఓపికగా వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
2027 సంక్రాంతికి కాకా సినిమాతో చిరంజీవి...
ఎట్టకేలకు సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి అయిందని ప్రకటన వచ్చింది. డబ్బింగ్ వర్క్‌ను మొదలు పెట్టినట్లుగా అఫిషియల్‌గా సోషల్ మీడియా ద్వారా ప్రకటన సైతం వచ్చింది. దాంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఇక విశ్వంభర ప్రపంచం లోకి వెళ్లబోతున్నామనే నమ్మకంతో ఉన్నారు. ఇది ఒక ఫ్యామిలీ చిత్రం, పిల్లలు, పెద్దలు కలిసి చూడదగ్గ సినిమా, కనుక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తే రీచ్ ఎక్కువ వస్తుందనే నమ్మకంతో మేకర్స్ 2027 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. గతంలోనూ ఈ సినిమాను సంక్రాంతికి అన్నారు, ఇప్పుడు రెండేళ్లు ఆలస్యంగా మళ్లీ సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదే సంక్రాంతికి చిరంజీవి కాకా విడుదల ఉండటంతో క్లాష్ అనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఈ విషయమై స్పందించాల్సి ఉంది.
విశ్వంభర వర్సెస్ కాకా...
విశ్వంభర సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇదే సమయంలో కొందరు ఇప్పటికి అయినా విశ్వంభర సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి అయ్యాయా, సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి అయిన వెంటనే విడుదలకు రెడీ అయినట్లు కాదు కదా, రీ రికార్డింగ్ ఉంటుంది, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. కనుక అవన్నీ కూడా సంక్రాంతి వరకు పూర్తి అయ్యేనా అనేది చూడాలి. ఇప్పటికే కాకా సినిమాను సంక్రాంతి బరిలో ఉంచారు కనుక విశ్వంభర ను సంక్రాంతి రేసులో నిలపాలంటే డిసెంబర్ చివరి వారం వరకు చిరంజీవి ముందు విశ్వంభర ఫస్ట్ కాపీని ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు చిరంజీవి దాన్ని చూసిన తర్వాత సంక్రాంతికి విడుదల చేయవచ్చా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి సంక్రాంతికి విశ్వంభర వచ్చేనా అనేది చూడాలి.