మంచు విష్ణు స్పెషల్ టూర్.. నెక్స్ట్ మూవీ షూటింగ్ అక్కడేనట..
సినిమా షూటింగ్స్ కోసం వేరే దేశాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల వైపు మొగ్గు చూపే హీరోలు చాలామందే ఉంటారు.
సినిమా షూటింగ్స్ కోసం వేరే దేశాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల వైపు మొగ్గు చూపే హీరోలు చాలామందే ఉంటారు. అయితే ఈసారి మంచు విష్ణు చూపు తెలంగాణలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలపై పడింది. మెదక్ జిల్లాలో ప్రత్యేకంగా పర్యటించిన ఆయన అక్కడి హిస్టరీ, కల్చర్, అందాలకు ఫిదా అయ్యారు. అంతేకాదు, తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన కొన్ని సీన్లను మెదక్ లోనే షూట్ చేసే ఆలోచన కూడా ఉందని వెల్లడించడం విశేషం.
వాస్తవానికి.. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇన్విటేషన్ మేరకు జిల్లాకు వచ్చిన విష్ణు మంచు, ముందుగా చారిత్రక ప్రాధాన్యం కలిగిన మెదక్ ఖిల్లాను సందర్శించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ కోటలోని నిర్మాణాలు, ఫుల్ ప్లాన్డ్ గా నిర్మించిన ప్రదేశాలు, అక్కడి వారసత్వ విశేషాలను క్లియర్ గా తెలుసుకున్నారు. జిల్లా హిస్టరీ రీసెర్చర్స్ కోటకు సంబంధించిన విశేషాలను వివరించగా, విష్ణు ఎంతో ఆసక్తిగా పరిశీలించినట్లు సమాచారం.
అక్కడి నుంచి ఆయన ఫేమస్ సీఎస్‌ఐ మెదక్ కేథడ్రల్ చర్చిని సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ చర్చి కన్సట్రక్షన్ స్టైల్, అద్దాల కిటికీలపై చిత్రీకరించిన ఏసుక్రీస్తు జీవిత ఘట్టాలు ఆయనను ఆకట్టుకున్నాయి. అదే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన విష్ణు, సందర్శకుల పుస్తకంలో కూడా ఎమోషనల్ మెసేజ్ రాశారు. అంతే కాదు ఆ పవిత్ర స్థలాన్ని దర్శించడం తన అదృష్టమని పేర్కొన్నారు.
ఆ తర్వాత ఫేమస్ టెంపుల్ అయిన ఏడుపాయల దుర్గాభవాని ఆలయాన్ని కూడా విజిట్ చేశారు. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, ప్రకృతి అందాలను ఆస్వాదించారు. మెదక్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, అడవులు, సరస్సులు, నేచురల్ లొకేషన్లు పర్యాటకులను అట్రాక్ట్ చేసే ఫుల్ పవర్ కలిగి ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మీడియాతో మాట్లాడిన విష్ణు మంచు, మెదక్ జిల్లాకు ఉన్న సినీ, పర్యాటక అవకాశాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"ఇక్కడి ప్యాలెస్ లు, అడవులు, సరస్సులు, టెంపుల్స్ సహా అన్నీ సినిమాల షూటింగ్ కు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఫ్యూచర్ లో నా సినిమాల షూటింగ్ ను ఇక్కడ నిర్వహించేలా ప్లాన్ చేస్తా" అని చెప్పారు. ముఖ్యంగా మెదక్ ఖిల్లాలో తన కొత్త చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే ఆలోచన ఉందని వెల్లడించారు. విష్ణు చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల సినీ ఇండస్ట్రీలో కొత్త లొకేషన్ల కోసం వెతుకున్న నేపథ్యంలో మెదక్ కూడా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
అయితే చారిత్రక నేపథ్యం, నేచురల్ అందాలు, హైదరాబాద్ కు సమీపంలో ఉండటం వంటి అంశాలు మెదక్ కు ఎక్స్ ట్రా ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. మెదక్ వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు ప్రపంచ పర్యాటక రంగంలో ప్రముఖ స్థానం కల్పించేందుకు తాను కోపరేట్ చేస్తానని విష్ణు హామీ ఇచ్చారు. అంతే కాదు.. ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఒక్కసారైనా మెదక్ ను సందర్శించాలని, అక్కడి చరిత్రను తెలుసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించాలని సజ్జెస్ట్ చేశారు.