బ్రాండ్స్‌లో నంబర్ వన్ స్టార్ అతడే
భారతదేశంలో బ్రాండ్ ప్రచారకర్తగా నంబర్ వన్ స్టాటస్ అందుకున్న వ్యక్తి సినీరంగానికి చెందినవాడు కాదు.. క్రీడా రంగానికి చెందిన ప్రముఖుడు. అది కూడా క్రికెట్‌లో. అతడు మరెవరో కాదు.. ది గ్రేట్ కింగ్ కోహ్లీ.;
భారత దేశంలో బ్రాండ్ పబ్లిసిటీలో నంబర్ వన్ స్టార్ ఎవరు? కింగ్ ఖాన్ షారూఖ్, రణ్ వీర్ సింగ్, రణబీర్ కపూర్ లేదా ఇంకెవరు? అంటే... కచ్ఛితంగా ఆ ముగ్గురూ ఎప్పటికీ కాదు.. భారతదేశంలో బ్రాండ్ ప్రచారకర్తగా నంబర్ వన్ స్టాటస్ అందుకున్న వ్యక్తి సినీరంగానికి చెందినవాడు కాదు.. క్రీడా రంగానికి చెందిన ప్రముఖుడు. అది కూడా క్రికెట్‌లో. అతడు మరెవరో కాదు.. ది గ్రేట్ కింగ్ కోహ్లీ.
కోహ్లీ బ్రాండ్ విలువ 231.1 మిలియన్ డాలర్లు. ప్రపంచ ఆర్థిక , రిస్క్ అడ్వైజరీ సొల్యూషన్స్ స్వతంత్ర ప్రొవైడర్ అయిన క్రోల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతదేశంలో సెలబ్రిటీ బ్రాండ్‌ల ర్యాంకింగ్ లు పరిశీలిస్తే.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, షారుఖ్ - రణ్‌వీర్‌లను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతడి బ్రాండ్ విలువ 231.1 మిలియన్ డాలర్లు. విరాట్ వరుసగా మూడో ఏడాది కూడా దేశంలో అత్యధిక విలువ కలిగిన సెలబ్రిటీ బ్రాండ్ హోదాను కొనసాగిస్తున్నాడు. కోహ్లీని ఇన్‌స్టా లో 273 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. 170.7 మిలియన్ డాలర్లతో రణ్ వీర్ రెండవ స్థానంలో నిలిచారు. పఠాన్, జవాన్ విజయాలతో ఉత్సాహంగా ఉన్న షారుఖ్ ఖాన్ మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. అతని బ్రాండ్ విలువ దాదాపు 21 శాతం పెరిగి 145.7 మిలియన్ డాలర్లకు చేరుకుంది. 116.4 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఆలియా నాల్గవ స్థానానికి చేరుకుంది. సచిన్ టెండూల్కర్ 112.2 మిలియన్ డాలర్లతో ఐదవ స్థానానికి ఎగబాకాడు.
టాప్ టెన్‌లో అక్షయ్ కుమార్ 108 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఆరవ స్థానాన్ని పొందగా, దీపికా పదుకొనే , ఎంఎస్ ధోని 102.9 మిలియన్ డాలర్లతో ఏడవ స్థానాన్ని పంచుకున్నారు. హృతిక్ రోషన్ 92.2 మిలియన్ డాలర్లతో తొమ్మిదవ స్థానానికి ఎగబాకారు. అమితాబ్ బచ్చన్ 83.7 మిలియన్ డాలర్లతో 10వ స్థానంలో ఉన్నారు. సల్మాన్ 16వ స్థానంతో సరిపెట్టాడు. ఈ జాబితాలో సౌత్ స్టార్లు ఎవరూ లేకపోవడం ఆశ్చర్యకరం. 2024 నాటికి టాప్ 25 భారతీయ ప్రముఖుల బ్రాండ్ విలువ 2 బిలియన్ డాలర్లకు చేరుకుందని అంచనా. ఈ ఏడాది గత సంవత్సరం కంటే 8.6 శాతం కంటే ఎక్కువ.