స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వల్ల వందల కోట్ల నష్టం?
అయితే ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఇన్ స్టా నుంచి వైదొలిగారు.;
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలు ప్రతిదీ నిర్ధేశిస్తున్నాయి. ఈ వేదికలపై వందల వేల కోట్ల వ్యాపారం నిరంతరం సాగుతూ ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఎవరైనా సెలబ్రిటీ సోషల్ మీడియాల నుంచి ఎస్కేప్ అయితే లేదా పూర్తిగా వైదొలిగితే జరిగే నష్టం ఎలా ఉంటుంది? పరిణామాలు ఎలా ఉంటాయి? అన్నది ఆరా తీస్తే, నిజానికి సామాజిక మాధ్యమాల నుంచి సెలబ్రిటీ వైదొలిగితే అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. వ్యక్తిగతంగా సదరు సెలబ్రిటీకి నష్టం వాటిల్లడమే కాకుండా, మెటా (ఇన్ స్టా వగైరా) కు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మిలియన్ల మంది ఫాలోవర్స్ నిరంతరం సెలబ్రిటీలను అనుసరిస్తారు. కానీ ఒకసారి సెలబ్రిటీ సైట్ నుంచి ఎస్కేప్ అయితే, ఈ ఫాలోవర్స్ నుంచి సందడి కూడా ఆగిపోతుంది. తద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే ప్రకటనలకు వీక్షకులు కూడా తగ్గిపోతారు. అలా వందల కోట్ల నష్టాన్ని సైలెంట్ గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నష్టం ఎవరెవరికి ఉంటుంది? అంటే బ్రాండ్ అంబాసిడర్ తో పాటు, మెటాకు, బ్రాండ్ కంపెనీకి కూడా నష్టం పెద్దగానే ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
అయితే ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఇన్ స్టా నుంచి వైదొలిగారు. ఆయన ఉన్నట్టుండి ఇలా చేయడంతో అంతా గందరగోళం నెలకొంది. విరాట్ కి ఇన్ స్టా లో దాదాపు 27 కోట్ల (270 మిలియన్లు) మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీరంతా ఇప్పుడు తీవ్రమైన గందరగోళంలో పడ్డారు. కోహ్లీ ఉన్నట్టుండి ఇలా చేసారేమిటి? అసలేమయ్యారు? ఆయనను ఇక ఇన్ స్టాలో చూడలేమా? అంటూ ఒకటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
ఒకవేళ ఇన్ స్టా నుంచి విరాట్ పర్మినెంట్ గా తొలగిపోతే అతడికి కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఒక నెలకు దాదాపు అతడికి ఇన్ స్టా యాడ్ పోస్టింగుల ద్వారా 45 -50 కోట్ల మధ్య ఆదాయం జనరేట్ అవుతోంది. అదంతా నష్టపోయినట్టేనని విశ్లేషిస్తున్నారు. అతడు ఒక్కో పోస్ట్ (ప్రకటన)కు 10-15 కోట్ల మధ్య వసూలు చేస్తున్నాడు. ప్రతి నెలా 3 పోస్టింగులు చేసినా అతడికి 45 కోట్లు సులువుగా వస్తుంది. ఇదంతా ఇప్పుడు కోల్పోయినట్టే కదా? విరాట్ అలా ఎందుకు చేస్తాడు? అంటూ విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ఇలా చేయడం ద్వారా కోహ్లీ తన ఫాలోవర్స్ లో ప్రకంపనాలు సృష్టించాడు. ఎస్కేప్ అయిన కోహ్లీ తిరిగి ఇన్ స్టాలోకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా సోషల్ మీడియాల్లో విరుచుకుపడతారు. ఇది నిజంగా బ్రాండ్స్ కి వైరల్ ప్రమోషన్ చేయడానికి ఉపయోగపడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ కోహ్లీ తన వ్యక్తిగత సంతోషం కోసం ఈ సోషల్ మీడియా న్యూసెన్స్ ని వదిలించుకోవాలని అనుకుంటే ఆ మేరకు అతడితో ఒప్పందాలు కుదుర్చుకున్న కార్పెరెట్ బ్రాండ్లు అతడి పారితోషికాన్ని కోసేస్తాయని కూడా విశ్లేషిస్తున్నారు.
ఇప్పటివరకూ కోహ్లీ ఎందుకు ఎగ్జిట్ అయ్యాడనేదానిపై సరైన జవాబు లేదు. విరాట్ మళ్లీ ఇన్ స్టాలో తన అనుచరుల కోసం వస్తాడనే చర్చ యథేచ్ఛగా సాగిపోతోంది. కోహ్లీ ఇన్ స్టా నుంచి శాశ్వతంగా వైదొలిగితేనే ఈ నష్టం ఉంటుంది. అతడు మళ్లీ తిరిగి వస్తే చాలా లాభాలు ఉంటాయని కూడా విశ్లేషిస్తున్నారు.