గ్లామ‌ర్ రంగం వ‌దిలి ఆధ్యాత్మిక‌త బాట‌లో

గ్లామ‌ర్ రంగంలో కృత్రిమ‌త్వం చాలా మందికి న‌చ్చ‌దు. నిజానికి ఈ రంగంలో ధ‌నార్జ‌నే ధ్యేయంగా కొన‌సాగ‌డం అంద‌రికీ సాధ్య‌ప‌డ‌దు.;

Update: 2026-01-30 04:16 GMT

గ్లామ‌ర్ రంగంలో కృత్రిమ‌త్వం చాలా మందికి న‌చ్చ‌దు. నిజానికి ఈ రంగంలో ధ‌నార్జ‌నే ధ్యేయంగా కొన‌సాగ‌డం అంద‌రికీ సాధ్య‌ప‌డ‌దు. కొంద‌రు డ‌బ్బు కోసం దేనికైనా తెగించినా, అలాంటి ఆలోచ‌న‌లు అంద‌రికీ ఉండ‌వు. చాలా సంద‌ర్బాల‌లో డ‌బ్బు అవ‌స‌రం కూడా ఇక్క‌డ వ్య‌క్తుల‌ను న‌డిపిస్తుంటుంది. అయితే గ్లామ‌ర్ రంగం వ‌దిలి ఇటీవ‌లి కాలంలో ప‌లువురు సెల‌బ్రిటీలు ఆధ్యాత్మిక‌త వైపు వెళ్ల‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కెమెరాలు ఆర్క్ లైట్ల వెళుతురు నుంచి, నియాన్ కాంతుల జిగిజాగ్ నుంచి.. రెడ్ కార్పెట్ క‌ల‌రింగ్ మ‌ధ్య నుంచి దూరంగా పారిపోతున్నారు.

బాలీవుడ్ లో హేమ‌మాలిని కుటుంబం ఎల్ల‌పుడూ ఆధ్యాత్మిక చింత‌న‌లో ఉండ‌టం తెలిసిన‌దే. ఇస్కాన్ - లార్డ్ కృష్ణ భ‌క్తులుగా ఉన్నారు. మ‌మ‌త కుల‌క‌ర్ణి వంటి న‌టి ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మోస్ట్ గ్లామ‌ర‌స్ న‌టి ఉన్న‌ట్టుండి ఇలా మార‌డాన్ని కొంద‌రు విమ‌ర్శించినా కానీ, తాను మ‌న‌శ్శాంతి కోసం ఈ మార్గాన్ని అన్వేషించాన‌ని ఆమె చెప్పారు. ఇటీవ‌ల విరుష్క జంట కూడా ఆధ్యాత్మిక పంథాను అనుస‌రిస్తున్నారు. ఇస్కాన్ (అంత‌ర్జాతీయ కృష్ణ సేవా సంఘం)లో స‌భ్యులుగా చేరి భ‌జ‌న్స్, కీర్త‌న్స్, భ‌గ‌వంతుని ధ్యానంలో నిజ‌మైన అలౌకిక‌ ఆనందాన్ని పొందుతున్నారు. స్వ‌త‌హాగా భ‌క్తి ప‌రురాలైన‌ అనుష్క శ‌ర్మ గ్లామ‌ర్ జిగ్ జాగ్ ని వ‌దిలిపెట్టి, పూర్తిగా త‌న భ‌ర్త‌ విరాట్ ని మార్చేసింద‌ని కూడా అభిమానులు భావిస్తున్నారు.

రూబీ భాటియా, సోనాలి బింద్రే, మ‌నీషా కొయిలారా, స‌నా ఖాన్ లాంటి న‌టీమ‌ణులు గ‌తంలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. స‌నా ఖాన్ ఇస్లామ్ లోకి వెళ్లి అల్లా ప్రార్థ‌న‌లో సాంత్వ‌న పొందారు. సోనాలి, మ‌నీషా త‌మ క్యాన్స‌ర్ జీవితం త‌ర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక‌త బాట‌ను అనుస‌రించారు. అయితే వెట‌ర‌న్ న‌టి రుబీ భాటియా ఆధ్యాత్మిక‌త‌ గురించి తెలిసింది చాలా త‌క్కువ‌. 90వ దశకంలో భారతీయ టెలివిజన్ రంగంలో రూబీ ఒక వేవ్. భారతదేశంలో శాటిలైట్ ఛానల్స్ అప్పుడ‌ప్పుడే ప్రాచుర్యం పొందుతున్న సమయంలో ఛానల్ వి ద్వారా రూబీ భాటియా దేశంలోనే తొలి వీడియో జాకీగా గుర్తింపు పొందారు. వీజే రూబీ మాట్లాడే తీరు, చలాకీతనం యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రూబీకి ఐశ్వ‌ర్యారాయ్, సుస్మితాసేన్, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి గొప్ప స్టార్ల‌తో స‌త్సంబంధాలున్నాయి. ఐష్, సుష్ ఇద్ద‌రూ 1994లో మిస్ ఇండియా పోటీల‌కు వెళ్లిన‌ప్పుడు ఆ ఈవెంట్ కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించారు రూబీ. ఐష్ ప్ర‌పంచ సుంద‌రిగా, సుష్ మిస్ యూనివ‌ర్శ్ గా కిరీటాల‌ను గెలుచుకున్న‌ప్పుడు కూడా రూబీ వారితోనే ఉన్నారు.

వీజేగా మారాక‌ అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలను ఇంటర్వ్యూ చేయ‌డంతో పాటు, పెద్ద పెద్ద అవార్డు ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే గ్లామ‌ర్ అండ్ గ్లిజ్ ప్ర‌పంచం త‌న‌కు మ‌న‌శ్శాంతిని ఇవ్వ‌లేదు. దీంతో ఆమె ఆధ్యాత్మిక మార్గాన్ని వెతుక్కున్నారు. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలోని కృత్రిమత్వం కంటే ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపారు. ప్ర‌స్తుతం గ్లామ‌ర్ ప్ర‌పంచానికి దూరంగా త‌న భ‌ర్త నితిన్ శైలేష్‌తో కలిసి ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నారు. యోగా, ధ్యానం, సనాతన ధర్మం గురించి ప‌రిశోధిస్తూనే, ఈ కొత్త‌ మార్గాన్ని ఆనంద‌మ‌య జీవ‌నంగా మ‌లుచుకున్నారు రూబీ. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఇలాంటి పేరును, డబ్బును వదులుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లడం నిజంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News