పద్మ అవార్డుని వదులుకున్న గాయని ఎస్ జానకి
దేశంలో పద్మ పౌర పురస్కారాలకు ఎంతటి ఆదరణ గౌరవం ఉంటాయో తెలిసిందే. ఆ అవార్డు కోసం జీవిత కాలం అంతా తపించిన వారు ఉన్నారు.;
దేశంలో పద్మ పౌర పురస్కారాలకు ఎంతటి ఆదరణ గౌరవం ఉంటాయో తెలిసిందే. ఆ అవార్డు కోసం జీవిత కాలం అంతా తపించిన వారు ఉన్నారు. అదే సమయంలో అవార్డు వస్తే తాము జీవితాంతం పడిన కష్టానికి తమ వృత్తికి ఎంతో మర్యాద మన్నన దక్కినట్లుగా భావించే వారు ఉన్నారు. అయితే ఈ అవార్డు లభించినా కూడా కొంతమంది వద్దు అని సున్నితంగా కాదనుకున్న అరుదైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా దక్షిణ భారత దేశంలో దిగ్గజ గాయనీమణి దశాబ్దాల పాటు తన గానంతో వేలాది పాటలు పాడి బహు భాషాభిమానులను సంపాదించుకున్న ఎస్ జానకి పద్మ అవార్డుని వద్దు అనుకున్నారు. ఇంతకీ ఆమె ఎందుకు వద్దు అనుకున్నారు ఆ విషయాలు ఏమిటి అన్నది చూస్తే కనుక ఆసక్తికరంగానే ఉంటుంది.
పుష్కర కాలం క్రితమే :
ఇప్పటికి 13 ఏళ్ళ క్రితం 2013 గణ తంత్ర వేడుకల సందర్భంగా సుప్రసిద్ధ గయని ఎస్ జానకికి పద్మ భూషణ్ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఏడాది వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన 24 మందికి పద్మ భూషణ్ అవార్డులు ప్రకటిస్తే కళా విభాగంలో ఎస్ జానకికి లభించింది. అయితే తన మొత్తం అయిదున్నర దశాబ్దాల గాయక ప్రస్థానంలో చాలా ఆలస్యంగా ఈ గౌరవం దక్కించి అని భావించిన ఎస్ జానకి పద్మభూషణ్ అవార్డును స్వీకరించడానికి నిరాకరించారు. ఇది అప్పట్లో సంచలనం గా మారింది.
అభిమానమే చాలు అంటూ :
ఈ అవార్డు ప్రకటన తరువాత ఎస్ జానకి మీడియాతో మాట్లాడుతూ తాను పద్మభూషణ్ అవార్డును నిరాకరిస్తున్నాను అని స్పహ్టంగా చెప్పారు. తాను గత 55 సంవత్సరాలుగా నేను పాడుతున్నానని గుర్తు చేశారు. వివిధ భాషలలో తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని వారి గుర్తింపుని వారి ప్రేమను తాను అత్యున్నత పురస్కారంగా భావిస్తున్నానని చెప్పారు.
ఎవరి మీద కోపం లేదంటూ :
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో దాదాపుగా ఇరవై వేల కంటే ఎక్కువ పాటలు పాడిన జానకి ఈ రోజుకీ అలాగే తన మాట మీద నిలబడ్డారు. తనకు ప్రభుత్వంపై ఎలాంటి కోపం లేదని ఆమె ఆనాడు సమర్ధించుకున్నారు. తాను వివిధ రకాల పాటలు పాడానని వాటిని అంతా మెచ్చుకున్నారని అందువల్ల ప్రజల గుర్తింపే ముఖ్యమని అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఒక యూ ట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ పద్మ అవార్డుని ఎస్ జానకి తిరస్కరించడం వెనక పెద్ద కారణాలు లేవని చెప్పారు. ఆమె తాను ప్రజల అభిమానంతో ఉన్నత స్థానంలో ఉన్నాను అని భావించారని అందుకే సున్నితంగానే వద్దు అనుకున్నారని చెప్పారు. మొత్తానికి ఎస్ జానకి పద్మ పురస్కారం కాదనుకోవడం విశేషం. ఆమె సహచర గాయని పి సుశీలకు కూడా పద్మ భూషణ్ అవార్డు దక్కింది. ఇక ఎస్పీబీకి పద్మశ్రీ, పద్మ భూషణ్ దక్కాయి. ఆయన మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది.