స్కూల్ పిల్లలపై సినిమాల ప్రభావం.. ఇదిగో ఇదే ప్రూఫ్!
సమాజం నుంచి పుట్టేది సినిమా. అయితే సినిమాల కారణంగా సమాజం ప్రభావితం అవుతుందా? అంటే ఎందుకు అవ్వదు? సమాజం సినిమాల కారణంగా ప్రభావితం అవుతుంది.;
సమాజం నుంచి పుట్టేది సినిమా. అయితే సినిమాల కారణంగా సమాజం ప్రభావితం అవుతుందా? అంటే ఎందుకు అవ్వదు? సమాజం సినిమాల కారణంగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ప్రభావితం అయ్యేందుకు ఆస్కారం ఉంది. సినిమాల కారణంగా చెడిపోయిన యువత గురించి నిరంతరం చర్చ సాగుతూనే ఉంది. టీవీ చానెళ్లలో క్రైమ్ స్టోరీలు ఆసక్తిగా చూసేవారికి ఇలాంటి విషయాలపై మంచి అవగాహన ఉంటుంది.
అయితే కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని కులహళ్లి గ్రామంలోని ఒక సంఘటన నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఊరిలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీసుకున్న ఒక వినూత్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ నిర్ణయం ఏమిటి? అంటే... ఆ ఉపాధ్యాయుడు ఊరిలో ఉన్న సెలూన్‌లు అన్నిటికీ ఒక నోటీస్ పంపించారు. అందులో విద్యార్థులకు ``హెబ్బులి హెయిర్ స్టైల్! చేయకూడద``నే అభ్యర్థన ఉంది.
`హెబ్బులి` హెయిర్ స్టైల్ అంటే ఏమిటి? అంటే... అది ఒక వైపు జుట్టును పూర్తిగా ట్రిమ్ చేసి, మరోవైపు పొడవుగా ఉంచేయడం... కిచ్చా సుదీప్ తన హెబ్బులి సినిమాలో ఈ హెయిర్ స్టైల్‌తో కనిపించారు. అది చూశాక బాగల్ కోట్ జిల్లాలోని ఆ ఊరిలో పిల్లలు అందరూ దానికి చాలా ప్రభావితం అయ్యారు. కిచ్చాను అనుకరిస్తూ తమ హెయిర్ స్టైల్ ని మార్చుకున్నారు.
అయితే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివాజీ నాయక్ తన పాఠశాలలోని బాలురు చదువుపై దృష్టి పెట్టకుండా ఈ ఫ్యాషన్స్ , హెయిర్‌స్టైల్స్ వెనుక పడుతున్నారని గమనించారు. ఆయన స్థానిక సెలూన్ యజమానులకు ఒక అధికారిక లేఖ రాశారు. అందులో ``విద్యార్థులు హెబ్బులి స్టైల్ లేదా ఇతర ఫిల్మీ స్టైల్స్‌లో జుట్టు కత్తిరించాలని కోరితే దయచేసి నిరాకరించండి`` అని విజ్ఞప్తి చేశారు.
అయితే ఇలాంటి కఠిననిర్ణయం తీసుకోవడానికి కారణం.. స్కూల్ లోని మగ విద్యార్థులంతా కొత్త లుక్ గురించి పాకులాడుతూ, చదువులకు డుమ్మా కొడుతున్నారని, పరీక్షల్లో మార్కులు అనూహ్యంగా తగ్గిపోయాయని కూడా టీచర్లు గమనించారు. అంతేకాదు.. గత కొన్నేళ్లుగా బాలికల కంటే బాలుర ఉత్తీర్ణత శాతం తగ్గుతుండటమే దీనికి కారణమని ఆయన విశ్లేషించారు.
ఆసక్తికరంగా .. స్కూల్ టీచర్ అభ్యర్థించగానే, ఊరిలో సెలూన్ యజమాని చెన్నప్ప సిద్ధ రామప్ప చాలా సానుకూలంగా స్పందించి తన సెలూన్ ముందు ``విద్యార్థులకు హెబ్బులి కటింగ్ చేయబడదు`` అని ఒక నోటీసు బోర్డు కూడా పెట్టారు. మొత్తానికి ఈ బోర్డ్ లో నోటీస్ బాగా పని చేసింది. విద్యార్థుల వినాశనం ఆగిపోయింది. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచేందుకు హెడ్ మాస్టర్ చేసిన ఈ ప్రయత్నాన్ని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. స్కూల్‌కు వచ్చే పిల్లలు సైనికులుగానో, పోలీసుల తరహాలో గౌరవప్రదమైన హెయిర్‌స్టైల్‌తో ఉండాలని ప్రధానోపాధ్యాయుడి ఉద్దేశ్యం.
ఆసక్తికరంగా ఈ మార్పులన్నిటి తర్వాత విద్యార్థులు కూడా దారిలోకి వచ్చారు. ఈ విషయంపై ఊళ్లో పెద్ద చర్చ సాగడం వల్ల తాము మారిపోయామని, సాధారణ హెయిర్ స్టైల్ కి షిఫ్టయ్యామని విద్యార్థులు చెప్పుకున్నారు. సినిమా ప్రభావం విద్యార్థులపై ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. గతంలో కూడా కొందరు దర్శకులు ఇలాంటి ప్రభావాల గురించి మాట్లాడారు.